కృష్ణా పుష్కరాల్లో హారతి

విజయవాడ దుర్గమ్మను స్మరించుకొనేలా నవదుర్గలకు ప్రతీకగా పుష్కరాల సందర్భంగా నవహారతులు ఇస్తున్నారని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. ఈ హారతిలో ఎక్కడా ఆధ్యాత్మికత భావనల్నీ, శాస్త్రసంప్రదాయాల్నీ విడిచిపెట్టకుండా ఆహా అనిపించేలా కార్యక్రమ నిర్వహణను చేపట్టామన్నారు. కృష్ణా హారతి వేదిక, నేపథ్యగాత్రం, సంగీతం, విద్యుదీకరణ, ప్రారంభ వేడుకల్లో బాణసంచా ఏర్పాట్లు... అన్నీ బోయపాటి ఆధ్వర్యంలోనే చేపట్టిన నేపథ్యంలో ఆయన్ను ‘ఈనాడు’ పలకరించింది. ‘నూతన రాజధానిలో తొలి పుష్కర వేడుకను చిరస్మరణీయంగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన సూచనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. 180 అడుగుల వెడల్పున పంట్లు పెట్టి హారతి వేదిక తయారుచేయించాం. దానికి వెనక బాణసంచా పేలుళ్ల కోసం 40 పడవలు ఉంచాం. బాణసంచా పేల్చే వేగానికి పడవలు వూగే ప్రమాదం ఉందని గ్రహించి, వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాం. విదేశాల నుంచి బాణసంచా తెచ్చారు. వీటిని పేల్చేందుకు అవసరమైన ప్రోగ్రామింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఏర్పాట్లను సినీ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణులు ఏక్‌నాథ్‌ చేశారు. ప్రారంభ వేడుకల రోజున ఉన్నది ఒక నిమిషం పేలుళ్ల కార్యక్రమమే. చివరి రోజున 5 నిమిషాలుంటుంది. అనుభూతి మాత్రం రెండుమూడు గంటలు పేలినట్లు ఉంటుంది. నది మీదుగా వచ్చే గాలికి హారతి ఎక్కడా కొండెక్కిపోకుండా కూడా జాగ్రత్తపడ్డాం. పురోహితులకు అవసరమైన పట్టు వస్త్రాల్ని, రుద్రాక్ష మాలల్నీ కాశీ నుంచి తీసుకొచ్చారు.

Posted On 13th August 2016