అమీర్ ఖాన్ ‘దంగల్’ ట్రెయిలర్

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్‌’ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమిర్‌ హరియాణాకి చెందిన మల్లయోధుడు మహావీర్‌ సింగ్‌ పోఘట్‌ పాత్రలో నటిస్తున్నారు. మహావీర్‌ తన నలుగురు కూతుళ్లను రెజ్లర్లుగా ఎలా తీర్చిదిద్దాడు అన్న విషయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పతకాలు సాధించేవారు చెట్టు నుంచి వూడిపడరు. ప్రేమ, కృషితో మనమే వారిని సాధించేలా ప్రోత్సహించాలి. మిగతా అథ్లెట్ల లాగే నాకూ ఓ కల ఉండేది. నా దేశానికి బంగారు పతకం తెచ్చిపెట్టాలని. కాబట్టి నేను సాధించలేనిది నా కుమారుడి ద్వారా సాధించుకోవాలనుకున్నాను. కానీ నలుగురూ కూతుళ్లే పుట్టారు. పతకం సాధించడానికి అమ్మాయి ఐతేనేం అబ్బాయి ఐతేనేం. కానీ వెండి పతకం సాధిస్తే ఆ క్షణాన మాత్రమే ప్రజలు గుర్తుంచుకుంటారు. అదే బంగారు పతకం తెస్తే ఓ ఉదాహరణగా, రోల్‌మోడల్‌గా నిలుస్తారు.. అని ఆమిర్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.
ఇందులో ఆమిర్‌ భార్యగా సాక్షి తన్వర్‌, కూతుళ్లుగా ఫాతిమా సనా, షేక్‌సాన్యా మల్హోత్రాలు నటించారు. డిసెంబర్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Source - ఈనాడు

Posted On 20th October 2016