సెల్‌ఫోన్‌కీ ఎయిర్‌బ్యాగ్‌లు వచ్చేశాయి

ఎప్పుడైనా చేతిలోంచి సెల్‌ఫోన్ కింద పడినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? కళ్లలో కంగారు, గుండెలో దడ. ఫోన్ పగిలిందా... గీతలు పడిందా... పనికిరాకుండా పోయిందా? ఇలాంటి ప్రశ్నలు మనసులోనే వేసుకుంటూ ఫోన్ పైకి తీస్తాం. ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు జపాన్ కార్ల తయారీ దిగ్గజం హోండా కంపెనీ ముందుకొచ్చింది. కార్లలో మాదిరిగానే స్మార్ట్ ఫోన్ల కోసం బిల్ట్ఇన్ ఎయిర్ బ్యాగ్స్‌ను రూపొందించింది. ‘కేస్ ఎన్’గా పిలిచే ఈ పరికరం స్మార్ట్ ఫోన్‌కి రక్షణ కవచంలా ఉపయోగపడగలదని హోండా కంపెనీ తెలిపింది.

హ్యాండ్‌సెట్‌ను జారవిడిచినప్పుడు వెంటనే ఆరు ఎయిర్ బ్యాగులు విచ్చుకుంటాయని దీంతో ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఫోన్‌ నేలపై దిగుతుందని పేర్కొంది. కేస్ ఎన్ పనితీరు వివరిస్తూ హోండా కంపెనీ విడుదల చేసిన వీడియోకి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. దీని పరిమాణం సెల్‌ఫోన్‌కి మూడింతలు పెద్దదిగా కనిపిస్తుండడంతో మరికొందరు పెదవి విరుస్తున్నారు. మరోవైపు కేస్ ఎన్ అనేది కేవలం కాన్సెప్ట్ మాత్రమేనని పూర్తి స్థాయి ఉత్పత్తి కాదని హోండా తెలిపింది. ఈ పరికరాన్ని ఉత్పత్తి చేస్తామోలేదో కూడా చెప్పలేమని పేర్కొంది. ఈ తరహా డిజైన్ ఒకటి తయారు చేయాలని యాపిల్ కంపెనీ కోరడంతో కేస్ ఎన్‌ను రూపొందించామని వెల్లడించింది. ఏదేమైనప్పటికీ ముందు ముందు దీనిని మరింత అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే సెల్‌ఫోన్ ప్రమాదాల నుంచి కాస్త రిలీఫ్ దొరికినట్టే!

Posted On 20th November 2016