పట్టిసీమ పరవళ్లు

కృష్ణమ్మను కలిసేందుకు గోదారమ్మ పరుగులు పెడుతోంది. కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీరు పరవళ్లు తొక్కుతోంది. మొత్తం 24 పంపులలో 23 పంపుల ద్వారా రోజుకు 8.142 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. ఇప్పటి వరకూ 49.5248 టీఎంసీలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించారు. గోదావరిలో నీళ్లున్నా గతంలో వాటిని సద్వినియోగం చేసుకోకపోవడంతో ఏటా 3000 టీఎంసీలను సముద్రంలోకి వదిలేసేవారు. ఇప్పుడు ఆ నీటిని పట్టిసీమ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోని ఎగువ ప్రాంతాలకూ, కృష్ణా డెల్టాకు అందిస్తున్నారు.


తాగునీటి కష్టాలు తీర్చేందుకు వీలుగా కాలువకు సమీపంలోని చెరువులను నింపుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పోలవరం కుడి ప్రధాన కాలువలో జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో కృష్ణా డెల్టా రైతుల్లో ఆనందం కన్పిస్తోంది. పట్టిసీమ పథకం నదుల అనుసంధానానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని ఇటీవల సమీక్షలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. ఈ పథకం వివరాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా కేంద్ర మంత్రికి వివరించడంతో పైవిధంగా స్పందించారు. ఈ సమాచారం తెలుసుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ సీఎం రమణసింగ్‌.. తమ రాష్ట్రంలోనూ అంతర్గత నదుల అనుసంధానానికి పట్టిసీమను ఉదాహరణగా తీసుకుందామ.. ఆయా రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో చెప్పారు. ఈ రాష్ట్రాల ఉన్నతాధికారులు త్వరలోనే పట్టిసీమను పరిశీలించే అవకాశం ఉంది.

Source: ఆంధ్రజ్యోతి

Posted On 26th November 2016