స్మృతి ఇరానీ నిరాడంబరత

ఆమె కేంద్రమంత్రి.. కావాలనుకుంటే ఏవైనా తన వద్దకే పరుగులు తీస్తాయి. కానీ సాధారణ వ్యక్తిలా వ్యవహరించిన తన నిరాడంబరతను చాటుకున్నారు. తెగిన చెప్పును కుట్టించుకునేందుకు నేరుగా ప్లాట్‌ఫారంపై ఉన్న ఓ చెప్పులు కుట్టే దుకాణానికి వెళ్లారు. దగ్గరుండి చెప్పు కుట్టించుకున్నారు. ఆమె కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో జరుగనున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్మృతి ఇరానీ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి కోయంబత్తూరు చేరుకున్నారు. విమానం దిగేటప్పుడు ఆమె కాలి చెప్పు తెగింది. విమానాశ్రయం నుంచి ఫౌండేషన్‌కు వెళ్లే దారిలో రోడ్డు పక్కనున్న చెప్పులు కుట్టే దుకాణం వద్ద కారు ఆపారు. స్వయంగా వెళ్లి చెప్పు కుట్టించుకున్నారు. దానికి ఎంత ఇమ్మంటావు అని అడగ్గా.. రూ.10 చాలని చెప్పులు కుట్టే వ్యక్తి చెప్పాడు. అయితే, స్మృతి ఇరానీ తన చేతిలోని రూ.100 నోటు ఇచ్చి, చిల్లర ఉంచేసుకోమని చెప్పారు. దీంతో సంతోషించిన అతడు ఆ చెప్పునకు అదనంగా చుట్టూ కుట్లు వేసి ఇచ్చాడు.

Posted On 27th November 2016