అనపకాయ పులుసు
అనపకాయ పులుసు

కావల్సినవి:
అనపగింజలు(ఇవి చిక్కుడు గింజల్లా ఉంటాయి. గింజలు ఒలుచుకోవాలి) - పావుకేజీ, 
పచ్చికొబ్బరి -సగం చిప్ప (తురుముకోవాలి), 
బంగాళాదుంపలు - రెండు, 
వంకాయలు - రెండు, 
బీన్స్‌ -150 గ్రా, 
టమాటా-ఒకటి, 
కొత్తిమీర - కట్ట, 
సెనగపప్పు - నాలుగు చెంచాలు, 
ధనియాలు - రెండు చెంచాలు, 
దాల్చినచెక్క - చిన్నవి రెండు, 
లవంగాలు - నాలుగు, 
పసుపు - పావుచెంచా,
ఎండుమిర్చి - ఐదు, 
ఉప్పు - తగినంత, 
నూనె -నాలుగుచెంచాలు, 
ఆవాలు- అరచెంచా, 
జీలకర్ర - అరచెంచా, 
కరివేపాకు రెబ్బలు -రెండు , 
ఇంగువ - కొద్దిగా, 
చింతపండు రసం- రెండు చెంచాలు. 

తయారీ:
ముందుగా సెనగపప్పు, ధనియాలు, లవంగాలు, దాల్చినచెక్క, ఎండుమిర్చిని రెండు చెంచాల నూనెలో దోరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. కాయగూరలు తరిగి అనప గింజలతో కలిపి తగినంత ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గింజల్లో చింతపండు రసం, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమం, తగినంత ఉప్పు చేర్చి పొయ్యి మీద పెట్టాలి. పదినిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేయాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పసుపు వేయించి పులుసుపై వేయాలి. ఇది అన్నం,చపాతీ, పూరీల్లోకి బాగుంటుంది.

Posted On 19th October 2016

Source eenadu