టీ20లో ట్రిపుల్ సెంచరీ...72 బంతుల్లో 300 పరుగులు...దిల్లీ క్రికెటర్‌ రికార్డు
టీ20లో ట్రిపుల్ సెంచరీ...72 బంతుల్లో 300 పరుగులు...దిల్లీ క్రికెటర్‌ రికార్డు

టెస్టుల్లో ఓ బ్యాట్స్‌మన్‌ 300 పరుగులు సాధించడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. వన్డేల్లో ద్విశతకం చేయాలంటే మాటలు కాదు. ఇక టీ20 విషయానికి వస్తే 100 పరుగులు బాదితే ఆహా.. ఓహో.. అంటాం. అలాంటిది ఓ కుర్రాడు టీ20ల్లో 300 పరుగులు చేసి ఔరా! అనిపించాడు.

72 బంతులు 300 పరుగులు 
దిల్లీలోని లలిత్‌ పార్క్‌లో ఫ్రెండ్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మావీ లెవెన్‌, ఫ్రెండ్స్‌ లెవన్‌ జట్లు తలపడ్డాయి. మావీ లెవన్‌ తరఫున ఆడిన 21 ఏళ్ల మోహిత్‌ అల్వాత్‌ పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 72 బంతుల్లో త్రిశతకం బాదాడు. బౌలర్లను వూచకోత కోసిన అతడి ఇన్నింగ్స్‌లో 39 సిక్సర్లు, 14 బౌండరీలు ఉన్నాయి. 18 ఓవర్‌ వద్ద అతడి వ్యక్తిగత స్కోరు 250. ఆ తర్వాత 12 బంతుల్లోనే మోహిత్‌ 50 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది 34 పరుగులు రాబట్టాడు. దీంతో మావీ లెవన్‌ 416 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఫ్రెండ్స్‌ లెవన్‌ 216 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మోహిత్‌ అల్వాత్‌ దిల్లీ తరఫున 3 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మూడు మ్యాచుల్లో అతడు చేసింది కేవలం 5 పరుగులే. టీ20 మ్యాచ్‌లో ఆడిన ప్రత్యర్థి బౌలర్ల సామర్థ్యం, బౌలింగ్‌ స్థాయి గురించి సమాచారం లేదు.

Posted On 7th February 2017

Source eenadu