ఇలా చేస్తే గుండె పదిలం
ఇలా చేస్తే గుండె పదిలం

కొన్ని జబ్బులు మొదలయ్యాయంటే దీర్ఘకాలం వేధిస్తాయి. గుండెజబ్బు ఇలాంటి సమస్యే. అందువల్ల ఇది వచ్చాక బాధపడే కన్నా దీని బారినపడకుండా చూసుకోవటమే అన్నింటికన్నా ఉత్తమం. వయసు, కుటుంబ చరిత్ర వంటి గుండెజబ్బు ముప్పు కారకాలు మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఇతరత్రా ముప్పు కారకాలను నియంత్రించుకోవటం మాత్రం సాధ్యమే.

* కొవ్వు తక్కువ ఆహారం: సంతృప్త కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగేలా చేస్తాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) మోతాదులు ఎక్కువైతే గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. మాంసం, చర్మంతో కూడిన చికెన్‌, వెన్న, ఛీజ్‌, వెన్నతీయని పాలతో చేసిన పదార్థాల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవటానికి మరో మంచి మార్గం పీచుతో కూడిన పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, పొట్టు తీయని పదార్థాలు తరచుగా తినటం. ఆహారం ద్వారా రోజుకు కనీసం 25-35 గ్రాముల పీచు లభించేలా చూసుకోవటం మంచిది. అలాగే ఉప్పు కూడా మితంగా తినాలి. రోజుకు 2 గ్రాములు అంతకన్నా తక్కువ (అర చెంచా) సోడియం మించకుండా చూసుకోవాలి.

* అరగంట వ్యాయామం: శారీరకశ్రమ గుండె సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె వేగంగా కొట్టుకునేలా చేసే వ్యాయామాలను రోజుకు కనీసం అరగంట సేపు చేయాలి. ఒకేసారి చేయటం కుదరకపోతే 10 నిమిషాల చొప్పున మూడు సార్లు చేసినా మంచిదే.

* పొగ మానెయ్యాలి: గుండెకు పొగ ప్రధాన శత్రువు. సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 70% ఎక్కువ. మంచి విషయం ఏంటంటే.. పొగ తాగటం మానేసినప్పటి నుంచే గుండె మరమ్మతు మొదలవుతుంది. అలాగే ఇతరులు వదిలిన పొగను పీల్చకుండా చూసుకోవటం కూడా కీలకమే.

* రక్తపోటు అదుపులో: హైబీపీ గుండెజబ్బు ముప్పును తెచ్చిపెడుతుంది. కాబట్టి అధిక రక్తపోటు గలవారు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. తరచుగా రక్తపోటును పరీక్షించుకుంటూ నియంత్రణలో ఉందో లేదో చూసుకోవాలి.

* ఒత్తిడి పెరగనీయొద్దు: ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది గుండెజబ్బుతో పాటు రకరకాల సమస్యల ముప్పులను పెంచుతుంది. ఒత్తిడి తగ్గటానికి రకరకాల మార్గాలున్నాయి. మంచి సంగీతాన్ని వినొచ్చు. స్నేహితుడితో గానీ కుటుంబ సభ్యులతో గానీ కలిసి నడవొచ్చు. నవ్వు కూడా రక్త ప్రసరణ మెరుగయ్యేలా చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి నవ్వు తెప్పించే సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూడొచ్చు. జోక్‌లు చదవొచ్చు. అన్నింటికీ మించి ఆఫీసు పనిని ఇంటి వరకు తెచ్చుకోకుండా చూసుకోవటమూ ముఖ్యమేనని గుర్తించాలి.

Posted On 14th February 2017

Source eenadu