విరాట్‌ కోహ్లీపై కపిల్‌ దేవ్‌ ప్రశంసల జల్లు
విరాట్‌ కోహ్లీపై కపిల్‌ దేవ్‌ ప్రశంసల జల్లు

సారథిగా టీమిండియాను ముందుడి నడిపిస్తూ.. అసాధారణ ఫామ్‌తో చెలరేగుతూ.. దిగ్గజాల అంచనాలను తలకిందులు చేస్తున్న పరుగుల సునామీ విరాట్‌ కోహ్లీపై టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. తాను చూసిన బ్యాట్స్‌మెన్లలో కోహ్లి అత్యుత్తమ ఆటగాడని కితాబిచ్చారు. ప్రపంచ దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ తెందుల్కర్‌, సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ల కలయికనే విరాట్‌ అని మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ వివరించారు.

‘యువ క్రికెటర్‌ సారథ్యంలోని టీమిండియా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రికార్డులను బ్రేక్‌ చేస్తుంది. అతని కెప్టెన్సీలోని భారత్‌ 23 టెస్టుల్లో 15 విజయాలను నమోదు చేసింది. సచిన్‌ బ్యాటింగ్‌ శైలిలో దయ, సమతూకం, టెక్నిక్‌, ఆధిపత్యం ఉంటుందని అదే రిచర్డ్స్‌ బ్యాటింగ్‌లో స్టైల్‌తో పాటు భీకర విధ్వంసం కనపడుతుంద’ని కపిల్‌ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాపై కోహ్లి ప్రదర్శన గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘2014 సీజన్‌లో కోహ్లీనే టాప్‌గా నిలిచాడు. అదే ఏడాది వాళ్ల(ఆస్ట్రేలియా)కు కావల్సిన సమాధానాన్ని కోహ్లి ఇచ్చేశాడు. కోహ్లిని స్లెడ్జింగ్‌ చేయడంతో నాలుగు టెస్టుల్లో నాలుగు శతకాలు బాది వాళ్లకు మంచి గుణపాఠం చెప్పాడు. కొన్ని సార్లు కొంతమంది క్రికెటర్లకు స్లెడ్జింగ్‌ ఉపయోగపడుతుంది. అదీ కోహ్లి లాంటి ఆటగాళ్లకు మాత్రమే. నాకు తెలిసి అతనిపై ఇలాంటి ప్రయత్నాలు మళ్లీ చేసే అవకాశం ఉంద’ని కపిల్‌ దేవ్‌ వివరించారు.

Posted On 16th February 2017

Source eenadu