పాలసీసాల్లో విషం
పాలసీసాల్లో విషం

వినడానికి ఇది కొద్దిగా వింతగా ఉన్నా ఇది నిజం అంటున్నారు పరిశోధకులు. పాల సీసాల్లో ఉండే బిపిఎస్‌ అంటే బిస్‌ఫినాల్‌ (Bisphenol) అనే పదార్థం శరీరంలోకి చేరి పిల్లల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయం ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. ప్లాస్టిక్‌ సీసాతో పాలు తాగిన పిల్లల్లో పెద్దయిన తరువాత ఆస్తమా, సంతానలేమి, డయాబెటిస్‌ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీరు కొన్ని కోతుల మీద పరిశోధనలు నిర్వహించారు. వీటి శరీరంలోకి బిపిఎస్‌ రసాయనం పంపి అనంతరం వాటిని పరిశీలించారు. తల్లి కోతుల్లో విపరీతమైన మార్పు వీరు గమనించారు. తల్లి కోతుల్లో ఉండే ఈస్ర్టోజన్‌ హార్మోను మీద ఈ రసాయనం ప్రతికూల ప్రభావాన్ని చూపడం వీరి దృష్టికి వచ్చింది. ఆరోగ్యంగా ఉండే తల్లి కోతి పలు అనారోగ్య సమస్యలకు గురికాగా, తన పిల్లలను పట్టించుకోకపోవడం, వాటి మీదే తిరగబడడం వంటి లక్షణాలు గుర్తించారు. ఇదంతా ఈ బిపిఎస్‌ రసాయన ఫలితమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ సీసాలతో పిల్లలకి పాలు పడితే పై ప్రమాదాలు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. తల్లులు తమ పిల్లలకు పాలు పట్టవలసివస్తే గాజు లేదా స్టీలు సీసాలో పట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో పాలు పట్టడం వలన అప్పటికప్పుడు వచ్చే నష్టమేమీ లేకపోయినా ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Posted On 16th February 2017

Source andhrajyothi