ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత ఫెదరర్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత ఫెదరర్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌.. రాడ్‌లెవర్‌ ప్రాంగణంలోని ప్రేక్షకులను కనువిందు చేయించింది. టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు రోజర్‌ ఫెదరర్‌(17), రఫెల్‌ నాదల్‌(9) నువ్వా.. నేనా అనే స్థాయిలో పోటీపడ్డారు. అయిదు సెట్ల పోరులో రోజర్‌ ఫెదరర్‌ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో రఫెల్‌ నాదల్‌పై విజయం సాధించి ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో ఫెదరర్‌ కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలతో, పదునైన షాట్లతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించారు.

పోటాపోటీగా.. 
ఆట ఆరంభం నుంచే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు తీవ్రంగా పోరాడారు. మొదటి సెట్‌ను 6-4 తేడాతో రోజర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్‌లో పుంజుకున్న నాదల్‌ 6-3తో ఫెదరర్‌పై విజయం సాధించాడు. మూడో సెట్‌ను 6-1 తేడాతో అలవోకగా గెలుచుకున్న ఫెదరర్‌.. నాలుగో సెట్‌లో 3-6తో నాదల్‌కు కోల్పోయాడు. నిర్ణయాత్మకమైన అయిదో సెట్‌లో 4-3 వద్ద ప్రత్యర్థిని బ్రేక్‌ చేసిన ఫెదరర్‌.. 6-3 తేడాతో సెట్‌ను గెలుచుకుని టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. టైటిల్‌ కోసం వారిద్దరూ 3 గంటల 37 నిమిషాలపాటు పోరాటం చేశారు.

Posted On 29th January 2017

Source eenadu