భారత్‌ జోరుకు ఆస్ట్రేలియా బ్రేక్‌, కోహ్లిసేనకు తొలి పరాజయం
భారత్‌ జోరుకు ఆస్ట్రేలియా బ్రేక్‌, కోహ్లిసేనకు తొలి పరాజయం

సొంతగడ్డపై ఓటమి లేకుండా సాగుతున్న భారత్‌ జోరుకు బ్రేక్‌ పడింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లను మట్టికరిపించి స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది టీమ్‌ ఇండియా. అంతర్జాతీయంగానూ క్రికెట్‌ విశ్లేషకుల నుంచి ప్రశంసలందుకుంది. కానీ, ఇవన్నీ ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఆరంభం కాకముందు. అత్యంత నాణ్యమైన స్పిన్నర్లు కలిగి, స్పిన్‌ బౌలింగ్‌లో ఆరితేరిన బ్యాట్స్‌మెన్లు ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో తేలిపోయారు. కనీసం గౌరవప్రదమైన ప్రదర్శన కూడా చేయకుండా సమష్టిగా చేతులెత్తేశారు. స్పిన్‌ మంత్రంతో ఆతిథ్య జట్టును చుట్టేసి 333 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది ఆస్ట్రేలియా.

ఓవర్‌నైట్‌ స్కోరు 143/4తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 285 పరుగులకు ఆలౌటైంది. సారథి స్టీవ్‌ స్మిత్‌(109) శతకంతో రాణించడంతో ఆసీస్‌ మంచి స్కోరు చేయగలిగింది. సహచర బ్యాట్స్‌మెన్లతో చిన్నచిన్న భాగస్వామ్యాలను నెలకొల్పుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 4, జడేజా 3 ఉమేశ్‌ యాదవ్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని మొత్తం 441 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది.

ఆ ఒక్కడే.. 
రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ జట్టు స్కోరు 10 వద్ద ఓపెనర్‌ మురళీ విజయ్‌ వికెట్‌ కోల్పోయింది. ఆసీస్‌ యువ సంచలన స్పిన్‌ బౌలర్‌ ఒకీఫె దెబ్బకు ఒకరివెనుక మరొకరు పెవిలియన్‌ బాట పట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో భారత్‌ను శాసించిన అతడు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆరు వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు తీసి టీమ్‌ ఇండియాను ఓటమిలోకి నెట్టేశాడు. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా ఒక్కడే టాప్‌స్కోరర్‌(31)గా నిలిచాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే వికెట్‌ సమర్పించుకున్నాడు. ఏడుగురు బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరు కూడా చేయలేదు. ఆసీస్‌ తరఫున స్మిత్‌ ఒక్కడే 109 పరుగులతో రాణిస్తే భారత్‌ జట్టు స్కోరు 107 దాటలేకపోయింది.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు:స్టీవ్‌ ఒకీఫ్‌ 
తొలి ఇన్నింగ్స్‌ 
ఆస్ట్రేలియా: 260 ఆలౌట్‌ 
భారత్‌: 105 ఆలౌట్‌

సెకండ్‌ ఇన్నింగ్స్‌ 
ఆస్ట్రేలియా: 285 ఆలౌట్‌ 
భారత్‌: 107 ఆలౌట్‌ 
* కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో టెస్టు మ్యాచ్‌ ఓడిపోవడం ఇదే మొదటిది. 
* 20 టెస్టుల తర్వాత భారత్‌కు ఇది తొలి పరాజయం. 
* రెండో టెస్టు మ్యాచ్‌ మార్చి 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆరంభంకానుంది.

Posted On 25th February 2017

Source eenadu