దేశమంతా నీ కోసం ప్రార్థనలు చేస్తుంది - సెహ్వాగ్
దేశమంతా నీ కోసం ప్రార్థనలు చేస్తుంది - సెహ్వాగ్

దేశరక్షణ కోసం ప్రాణాలు ఎదురొడ్డి సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న భారత సరిహద్దు దళానికి మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మద్దతు తెలిపారు. కుటుంబసభ్యులను వదిలి రాత్రింబవళ్లు పహరా కాస్తున్న వారందరిపై ప్రేమను కురిపించాడు. ముఖ్యంగా ఇటీవల ఉగ్రవాదుల దాడిలో గాయపడిన మేజర్‌ అమర్‌దీప్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నాడు.

‘మేజర్‌ అమర్‌దీప్‌ ఒక సైనికుడు. అతని తలలో బుల్లెట్‌ దిగింది. ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. దేశమంతా నీ కోసం ప్రార్థనలు చేస్తున్నది సోదరా..’ అని మాజీ సైన్యాధికారి మేజర్‌ గౌరవ్‌ ఆర్య చేసిన ట్వీట్‌కు వీరూ స్పందించాడు. ఈ సందర్భంగా అమర్‌దీప్‌కు చికిత్స చేస్తున్న ఫొటోను కూడా మాజీ అధికారి పోస్ట్‌ చేశారు. ఈ నెల 23న శ్రీనగర్‌కు దాదాపు 60 కి.మీ. దూరంలో కుంగ్ను ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించి తిరుగుముఖం పట్టిన ఆర్మీ కాన్వాయ్‌పై షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేయడంతో ముగ్గురు సైనికులు, ఒక మహిళ మృతిచెందారు. ఈ ఘటనలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ ముకేశ్‌ ఝాతో పాటు అమర్‌దీప్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు.

సమయం వచ్చినప్పుడల్లా తన చిరస్మరణీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సెహ్వాగ్‌ ఈ నెల 22న భారత సైన్యం గొప్పతనం గురించి కూడా ట్విటర్‌లో వివరించాడు. సైనికులు మన దేవుళ్లు అని పిలుపునిస్తూ.. 2005-06 సీజన్‌లో బెంగళూరు ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ తీసుకున్నప్పుడు తీసిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు సెహ్వాగ్‌. భారత సైన్యానికి మద్దతు తెలపడంలో అందరికన్నా ముందుంటాడు. భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనితో పాటు సెహ్వాగ్‌కు కూడా సైన్యం గౌరవ హోదా కల్పించింది.

Posted On 27th February 2017

Source eenadu