5జీ స్మార్ట్‌ఫోన్‌...సెకనుకు 1జీబీ డేటా డౌన్‌లోడ్‌
5జీ స్మార్ట్‌ఫోన్‌...సెకనుకు 1జీబీ డేటా డౌన్‌లోడ్‌

2జీ.. 3జీ.. 4జీ.. ఇక తరువాతి తరం 5జీ. ఇంకా పూర్తిగా 4జీ సేవలనే కచ్చితత్వంతో పొందలేకపోతున్నాం. అప్పుడే మరో తరం వచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించారు. ప్రముఖ చైనా కంపెనీ జెడ్‌టీఈ ‘గిగాబిట్‌’ పేరుతో ఈ నూతన ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో సెకనుకు 1జీబీ వేగంతో డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 4జీ కన్నా 10రెట్లు వేగంగా పనిచేస్తుంది. స్పెయిన్‌ రాజధాని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్‌ ఫెయిర్‌. వాణిజ్య పరంగా ఈ సాంకేతికత 2020లోగా అందుబాటులోకి రానున్నట్లు జెడ్‌టీఈ సంస్థ పేర్కొంది. భవిష్యత్‌లో సెకన్లలోనే పూర్తి నిడివి గల సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందని కూడా తెలిపింది. అంతేగాక అత్యంత వేగంగా ఇంటర్నెట్‌లో సినిమాలను చూసేందుకు, ఫోన్లలోనే టీవీ ప్రసారాలు వీక్షించేందుకు వీలుకానుంది. మరోవైపు దక్షిణకొరియా సంస్థ కేటీ కార్ప్‌ 2018 వింటర్‌ ఒలింపిక్స్‌లో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నెలల క్రితమే వినియోగదారులందరికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టెలికాం సంస్థలన్నీ 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులోనూ రిలయన్స్‌ జియో సృష్టించిన రికార్డులు అంతాఇంతా కాదు. ఇప్పుడు ఈ కొత్త సాంకేతికతను ముందుగా ఏ సంస్థ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారుల ఆదరణను పొందుతుందో చూడాలి.

Posted On 27th February 2017

Source eenadu