హైదరాబాద్ యువ క్రికెటర్ సంచలనం
హైదరాబాద్ యువ క్రికెటర్ సంచలనం

హైదరాబాద్ యువ బౌలర్ మహమ్మద్ సిరాజ్ పేరు ఇవాళ క్రికెట్ ప్రపంచంలో అందరికీ తెలిసింది. ఐపీఎల్-2017 ఆటగాళ్ల వేలంలో సిరాజ్ హార్డ్ వర్క్‌కు ప్రతిఫలం దక్కింది. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు అతన్ని రూ.2.6 కోట్లకు దక్కించుకుంది. ‘‘క్రికెట్‌లో నా తొలి సంపాదన గుర్తొస్తోంది. అది 25 ఓవర్ల క్లబ్ మ్యాచ్‌. 20 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాను. కెప్టెన్ అయిన మా మావయ్య బహుమతిగా 500 రూపాయలు ఇచ్చారు. చాలా గొప్పగా అనిపించింది. ఇప్పుడది 2.6 కోట్లకు పెరిగింది. నమ్మలేకపోతున్నాన’’న్నాడు సిరాజ్. ‘‘మా నాన్నగారు మహమ్మద్ గౌస్ ఆటో డ్రైవర్. ఏ రోజూ మాకు కష్టం తెలియనివ్వలేదు. అమ్మానాన్నల కోసం హైదరాబాద్‌లో ఇల్లు కొంటాన’’ని చెప్పాడు. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ వంటి గొప్ప క్రికెటర్లతో కలిసి ప్రయాణించే అవకాశం నా అదృష్టమని సంతోషం వ్యక్తం చేశాడు సిరాజ్.

Posted On 20th February 2017

Source andhrajyothi