కోహ్లి సంపాదన రోజుకి రూ.4 కోట్లు
కోహ్లి సంపాదన రోజుకి రూ.4 కోట్లు

ప్రపంచ మార్కెట్‌లో విరాట్‌ కోహ్లి బ్రాండ్‌ విలువ ఇస్రో రాకెట్‌లా దూసుకెళ్తొంది. ముఖ్యంగా ఇటీవల అన్ని ఫార్మాట్లకు సారథ్య బాధ్యతలు చేపట్టడం, వరుసగా ద్విశతకాలు బాదడంతో అతని విలువ వూహించని స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం 17 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా కొనసాగుతూ కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ.. ఔత్సాహిక వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. తన ఆటతీరుతో స్వదేశీ క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. జట్టును వరుస విజయాలతో ముందుండి నడిపించడం, అతనిలో ఉన్న దూకుడు, వ్యవహారశైలి, యువతను ఎక్కువగా ఆకర్షిస్తుండటంతో ప్రముఖ కంపెనీలు ఒప్పందం చేసుకోవడానికి అతని ఇంటికి వరుస కడుతున్నాయి.

అప్పుడే సెలబ్రిటీ హోదా.. 
2010లో బాలీవుడ్‌ నటి జెనీలియాతో కలిసి కోహ్లి తొలిసారి ఫాస్ట్‌ట్రాక్‌ ప్రకటనలో మెరిశాడు. దీని కోసం ఆ సంస్థ రూ.25లక్షలు మాత్రమే చెల్లించింది. అప్పుడే సెలబ్రిటీ హోదా సంపాదించాడు. తర్వాత ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మతో కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో పాల్గొన్నాడు. ఇందులో అనుష్కతో కలిసి డ్యాన్స్‌ కూడా చేశాడు కోహ్లి. ప్రస్తుతం ఒక రోజుకు విరాట్‌ వసూలు చేస్తున్న మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అతని క్రేజ్‌కు తగ్గట్టుగా వాణిజ్య ప్రకటనల కోసం రోజుకి రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు మార్కెట్‌ వర్గాల సమాచారం. కోహ్లి కెరీర్‌ గ్రాఫ్‌ రోజురోజుకి పైపైకి సాగుతూనే ఉంది. అతనిపై అభిమానులకు ఎంతో ఆసక్తి ఉండటం వల్ల అతడు ప్రచారకర్తగా ఉన్న ఉత్పత్తులను ఉపయోగించేందుకు ఉత్సాహం చూపిస్తారని ప్రముఖ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్యూమాతో రూ.110కోట్లతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు విరాట్‌ కేవలం వాణిజ్య ఒప్పందాలకు మాత్రమే పరిమితం కావడంలేదు. ఆ సంపాదనతో పలు సంస్థలు, లీగ్‌ల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాడు.

ఎంటర్‌ప్రెన్యూర్‌గా కోహ్లి ప్రస్థానం 
1. చిజెల్‌(ఫిట్‌నెస్‌ స్టార్టప్‌ కంపెనీ) 
2. రాన్‌(యూత్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌) 
3. స్టెప్తలాన్‌(ఫిట్‌నెస్‌ వెంచర్‌) 
4. స్పోర్ట్‌ కాన్వో(సోషల్‌నెట్‌వర్కిగ్‌ స్టార్టప్‌) 
4. ఎఫ్‌సీ గోవా(ఫుట్‌బాల్‌ జట్టుకు సహవ్యవస్థాపకుడు) 
5. యూఏఈ రాయల్స్‌(టెన్నిస్‌ టీమ్‌ సహవ్యవస్థాపకుడు) 
6. మువే అకాస్టిక్స్‌(ఆడియో ఎక్విప్‌మెంట్‌ కంపెనీ)వాణిజ్య సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు 
ఆడీ, బూస్ట్‌, కోల్గేట్‌, జియోనీ, హెర్బల్‌ లైఫ్‌, మాన్యవర్‌, ఎమ్‌ఆర్‌ఎఫ్‌, నితేశ్‌ ఎస్టేట్స్‌, పెప్సీ, పీఎన్‌బీ, సామ్‌సొనైట్‌, శ్యామ్‌ స్టీల్‌, స్మాష్‌, టిస్సాట్‌, యూఎస్‌ఎల్‌, వాల్వోలిని, విక్స్‌ తాజాగా ప్యూమాకు కోహ్లి ప్రచారకర్తగా ఉన్నాడు.

Posted On 22nd February 2017

Source eenadu