కపిల్‌దేవ్‌ రికార్డు బ్రేక్‌ చేసిన అశ్విన్‌
కపిల్‌దేవ్‌ రికార్డు బ్రేక్‌ చేసిన అశ్విన్‌

భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ 37ఏళ్లక్రితం నెలకొల్పిన రికార్డును తాజాగా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అధిగమించాడు. సొంతగడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా మరో ఘనత అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్టు రెండోరోజు ఆట ఉదయం సెషన్‌లో మిచెల్‌ స్టార్క్‌ వికెట్‌ తీసి అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 1979-80 సీజన్‌లో ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ 13 టెస్టుల్లో 63 వికెట్లు తీసి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయితే స్టార్క్‌ వికెట్‌ తీయడంతో సొంతగడ్డపై ప్రస్తుత సీజన్‌లో తాను ఆడుతున్న 10వ టెస్టులో 64వ వికెట్‌ను తీసి కపిల్‌ దేవ్‌ రికార్డును అధిగమించాడు అశ్విన్‌. ఇటీవల భారత్‌ వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకోవడంలో అశ్విన్‌ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

2012-13 సీజన్‌లోనే 10 టెస్టుల్లో 61 వికెట్లు తీసిన అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో తన సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 27 వికెట్లు, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లో 28 వికెట్లు, బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆరు వికెట్లు తీసి గొప్ప బౌలర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన ఘనత కూడా అతని పేరిటే ఉంది.

Posted On 24th February 2017

Source eenadu