పవన్ పోటీ చేసే నియోజకవర్గం
పవన్ పోటీ చేసే నియోజకవర్గం

ప్రస్తుతం అందరి చూపు పవన్ పైనే పడింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవనకల్యాణ్‌ అనంతపురం జిల్లా నుంచే పోటీచేస్తానని మరోసారి ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 2016 నవంబర్‌ 10న ఆయన అనంతపురం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందులో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడారు. రాష్ట్రంలో తమ పార్టీ తొలి కార్యాలయాన్ని అనంతపురంలోనే ప్రారంభిస్తామని చెప్పి సంచలనం సృష్టించారు. ఆరోజు నుంచే పవన్ కదలికలపై చర్చ కొనసాగుతోంది. యువతలో క్రేజ్‌ ఉన్న పవన్ కల్యాణ్‌ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

గత నవంబరు 10న జనసేన సభలో పవన్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పినప్పుడే జిల్లాకు చెందిన నాయకుల్లో ఆందోళన మొదలైంది. ఒకరిద్దరు పవన్ పోటీని తాము ఆహ్వానిస్తున్నామని కూడా తమ సన్నిహితులతో చెప్పారు. తాజాగా ఈనెల 14న జరిగిన జనసేన పార్టీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా వపన్ కల్యాణ్‌ చాలాసేపు పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని విధాలా వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచే తాను పోటీ చేయదలిచానని ప్రకటించారు. జిల్లాలో పవన్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారోననే ఆసక్తి నెలకొంది.

ప్రచారంలో కదిరి..

జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఇప్పటికే ఆయన వ్యక్తిగత వ్యవహారాల ఇనచార్జి రఘురామయ్య మకాం వేసి స్థలం కోసం అన్వేషిస్తున్నారు. అనంతపురంలో ప్రారంభించేది పార్టీ రాష్ట్ర స్థాయి కార్యాలయంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు పవన్ కూడా అనంతపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి ప్ర స్తుతం పవన్‌ శ్రేయోభిలాషిగా ఉన్నారు. అలాంటప్పుడు టీడీపీతో అవగాహనతోనే ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారినా పవన్ పోటీ అనంతపు రం జిల్లా నుంచే చేయడమనేది తథ్యమనే అభిప్రాయాలూ వినిపిస్తున్నా యి.

తాజా పరిస్థితుల రీత్యా వచ్చే ఎన్నికల్లో టీడీపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వైసీపీ మరో జాతీయపార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి జాతీయ పార్టీతో జగన్ చేతులు కలిపితే టీడీపీ కూడా పవన్‌‌తో చేతులు కలిపే అవకాశాలుంటాయనే విశ్లేషణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పవన్ పోటీచేసే స్థానం అనంతపురమేనని ఇప్పటిదాకా చర్చల్లో ఉండగా తాజాగా కదిరి పేరు వినిపిస్తోంది. అనంతపురం నుంచి కాకుండా కదిరినుంచి పోటీ చేస్తే జనసేన పార్టీని రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో బలోపేతం చేసుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

కదిరి అటు చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో ఉంది. అమరావతికి ఎటుదిరిగీ కర్నూలు జిల్లా మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి కదిరి స్థానంపైనే పవన్‌ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా, గుంతకల్లులో ఆయనకు బలమైన అభిమాన సంఘం ఉంది. కాబట్టి గుంతకల్లు నుంచి పోటీచేసినా ఆశ్యర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

పీఆర్పీ తీరయితే కష్టమే..

జనసేన పార్టీ పీఆర్పీలా మారితే మనుగడ కష్టమేని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో పార్టీ నిర్మాణమే జరుగలేదు. జిల్లాలో జనసేనకు నాయకులెవరో కూడా తెలియదు. జిల్లా కమిటీ అసలే లేదు. ఈ పరిస్థితుల్లో గత నవంబరు 10న జరిగిన బహిరంగ సభ సందర్భంగా నిర్వాహకులెవరో చివరిదాకా తేలలేదు. పవనకల్యాణ్‌ సామాజిక వర్గానికి చెందిన నాయకులే చివరికి సభ ఏర్పాట్లు చూశారు. వారే జనసేన నాయకులుగా వ్యవహరించారు. గతంలో పీఆర్పీలో చిరంజీవి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యమిచ్చినట్టు విమర్శలున్నాయి. దీంతో ఇతర సామాజిక వర్గీయులు పీఆర్పీని స్వీకరించలేపోయారనే అభిప్రాయాలున్నాయి. అప్పటికే పీఆర్పీలో చేరిన కొందరు నేతలు ఆ తరువాత ఏర్పాటైన జగన్ పార్టీ వైసీపీలోకి జంప్‌ అయ్యారు. ప్రస్తుతం రాజకీయ పోటీకి సిద్ధమవుతున్న జనసేన పార్టీ కూడా పవన సామాజిక వర్గీయులకే పెద్దపీట వేస్తోందనే విమర్శలున్నాయి. అలా అయితే పీఆర్పీ అనుభవాలే పునరావృతం కాక తప్పదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

పవన్ కదలికలపై టీడీపీ నేతల దృష్టి.. 
పవనకళ్యాణ్‌ కదలికలపై జిల్లా టీడీపీ నేతల దృష్టి పడింది. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలుసుకోవడానికి ఎవరికి వారు వేగులను సిద్ధం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు జనసేన పార్టీ విషయాలు తెలుసుకుంటున్నారు. రఘురామయ్య సన్నిహితులను పలకరించి మరీ పవన పోటీ చేసే నియోజకవర్గం పేరు చెప్పాలని అడుగుతున్నారు.

Posted On 20th March 2017

Source andhrajyothi