ప్రకృతి ప్రేమికుడు యూపీ సీఎం
ప్రకృతి ప్రేమికుడు యూపీ సీఎం

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌కి జంతువులు, ప్రకృతి అంటే ఎంతో ఇష్టమట. గోరఖ్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఉండే శునకం, పిల్లి, కోతులు, దుప్పి అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఖాళీ సమయాల్లో ఈ ఆలయానికి వచ్చి వీలైనంత ఎక్కువ సమయాన్ని వీటి మధ్యే గడుపుతారంట.

ప్రతిరోజూ ఉదయం ఆదిత్యనాథ్‌ స్వయంగా కోతులకు ఆహారం అందజేస్తారు. ఆదిత్యనాథ్‌ పెంపుడు శునకం పేరు కల్లు. ఒక రోజు ఆయన బిజీగా ఉండటంతో కల్లుని చూడలేదు. దీంతో అది ఆయనపై బెంగ పెట్టుకుని అరుస్తూనే ఉంది... ఆ తర్వాత కొద్దిసేపటికి ఆదిత్యనాథ్‌ అక్కడికి వచ్చి కల్లుతో సరదాగా గడపడంతో అది అరవడం మానేసి హాయిగా గడిపింది. కొన్నాళ్ల క్రితం భారత్‌-నేపాల్‌ సరిహద్దులో చిరుత పిల్ల అరుస్తూ కనపడటంతో బాల్‌రామ్‌పూర్‌ జిల్లా తులసిపూర్‌లోని ఆశ్రమానికి తీసుకువచ్చారు. కొన్ని నెలల పాటు ఆ చిరుత పిల్ల అక్కడే పెరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు దాన్ని ఆశ్రమ నిర్వాహకులు అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. చిరుత పిల్ల ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన ఆదిత్యనాథ్‌ తానే స్వయంగా దానికి పాలు పట్టించారు. దీన్ని బట్టే తెలుస్తోంది ఆయనకు జంతువులంటే ఎంతో ప్రేమో.

1990ల్లో నాటి సీఎం జంతు వేటగాళ్లపై ఉద్యమం ప్రకటించారు. ఆ సమయంలో ఎంతో ఆసక్తిగా ఉద్యమంలో పాల్గొన్న ఆదిత్యనాథ్‌ లఖీంపూర్‌, సిద్ధార్థ్‌నగర్‌, మహారాజ్‌గంజ్‌ జిల్లాల్లోని ప్రతినిధులను కలిసి సలహాలు, సూచనలు చేసేవారు. చెట్లను నాటుతూ ప్రకృతి పట్ల తనకు ఉన్న ప్రేమను చాటేవారు ఆదిత్యనాథ్‌. ఆయన నివాస పరిసరాల్లో గోరఖ్‌నాథ్‌ ఆలయం చుట్టుపక్కల ప్రదేశాల్లో మామిడి, అశోక, మర్రి వృక్షాలతో పాటు ఇతర ఔషధ మొక్కలను నాటారు.

Posted On 21st March 2017

Source eenadu