ఒక్కసారిగా పెరిగిన ‘డి-మార్ట్‌’ షేర్స్
ఒక్కసారిగా పెరిగిన ‘డి-మార్ట్‌’ షేర్స్

అవెన్యూ సూపర్‌మార్ట్‌.. డీమార్ట్‌ మాతృ సంస్థ అయిన దీని పేరు నేడు మార్కెట్లో మార్మోగిపోయింది. స్టాక్‌మార్కెట్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలాకు గురువుగా భావించే రాధాకృష్ణా దమానీ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ఈ కంపెనీ షేర్లు నేడు రికార్డు స్థాయిలో లిస్టింగ్‌ అయ్యాయి. మదుపరులకు రెండింతల లాభాలను తెచ్చిపెట్టాయి. పబ్లిక్‌ ఇష్యూ(ఐపీవో)కు వచ్చిన తొలిరోజే అవెన్యూ సూపర్‌మార్ట్‌ షేర్లు అదరగొట్టేశాయి. ఈ షేర్లు మంగళవారమే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ప్రారంభ ధరను రూ.299గా నిర్ణయించారు. ట్రేడింగ్‌ సందర్భంగా ఇవి 117శాతం పెరిగి అత్యధికంగా రూ.648.90కు చేరింది. దీంతో ఒక్కసారిగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.40వేల కోట్లకు చేరింది. తాజా ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ.1,870 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డి-మార్ట్‌ షేర్లు రూ.648 అధిగమించడంతో మాతృసంస్థ అధినేత రాధాకృష్ణన్‌ దమానీ 6 బిలియన్‌ డాలర్ల సంపదతో బిలయనీర్ల జాబితాలో కీల‌క స్థానానికి చేరిపోయారు. రాహుల్‌ బజాజ్‌ (3.5బిలియన్‌ డాలర్లు), అనిల్‌ అగర్వాల్‌ (3 బిలియన్‌ డాలర్లు), అనిల్‌ అంబానీ(2.7 బిలియన్‌ డాలర్లు)లను అధిగమించారు. ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు దమానీ సలహాదారుడిగా సుపరిచితులే.

ఈ నెల 8-10తేదీల్లో అవెన్యూ సూపర్‌మార్ట్‌ షేర్లు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభంగా కాగా.. 104 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. కాగా, నేడు బీఎస్‌ఈలో 80.93లక్షల షేర్లు ట్రేడ్‌ కాగా.. ఎన్‌ఎస్‌ఈలో 4కోట్ల షేర్లు చేతులు మారాయి. గతేడాది అక్టోబర్‌లో పీఎన్‌బీఐ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.3,000కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. దాని తర్వాత ఇదే అతి పెద్ద ఐపీవో కావడం గమనార్హం.

ఈ ఇష్యూ కన్నా ముందుకు దమానీ కుటుంబ సభ్యులైన గోపీకిషన్‌ ఎస్‌ దమానీ, శ్రీకాంతదేవి ఆర్‌ దమానీ, కిరణ్‌దేవి జి దమానీలకు 91శాతం వాటా ఉంది. అంటే 512, 910, 000 షేర్లు వారికి ఉన్నాయి. ఈ ఐపీవోతో సంస్థలో కుటుంబం వాటా 82శాతానికి తగ్గింది. మంగళవారం నాడు ఏకంగా రూ.32వేల కోట్ల విలువైన షేర్లు చేతులు మారాయి.

Posted On 21st March 2017

Source eenadu