లేపాక్షికి ప్రపంచ గుర్తింపు...యునెస్కో జాబితాలో చోటు
లేపాక్షికి ప్రపంచ గుర్తింపు...యునెస్కో జాబితాలో చోటు

విజయనగరరాజుల కాలంలో గొప్ప వాణిజ్యకేంద్రంగా, పురాతన చిత్ర, శిల్పకళల కాణాచిగా గుర్తింపు పొందిన ‘లేపాక్షి’ త్వరలో ప్రపంచపటంలో తన స్థానాన్ని పదిలం చేసుకోనుంది. ఆలయంలోని గొప్ప చిత్రాలు, చారిత్రక నేపథ్యం, అబ్బురపరిచే చిత్రలేఖనం, భౌగోళిక చిత్రపటం(సైట్‌ప్లాన్‌) తదితర వివరాలను యునెస్కో నమూనాలో పంపాలంటూ కేంద్ర ప్రభుత్వం పురావస్తుశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

లేపాక్షిలో దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో అచ్యుతరాయల ఆస్థానంలో ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న విరూపణ్ణ నిర్మించారు. వేలాడేస్తంభం, లతామంటపం, నాట్యమంటపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మంటపం, ఏడు శిరస్సుల నాగేంద్రుడు, సీతమ్మపాదం, ఏకశిలా నందివిగ్రహం తదితర పురాతన చిత్ర, శిల్పకళలు ఎన్నో ఉన్నాయి. రాజులకాలం నాటి నీతి కథలు నేటికీ మనకు దర్శనమిస్తాయి. ఇంతటి ఘనచరిత్ర కలిగిన లేపాక్షి అభివృద్ధి నామమాత్రంగానే ఉంది. ఇప్పటికే పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

ఉత్సవాలతో వెలుగులోకి... 
లేపాక్షి ప్రాశస్త్యాన్ని రాష్ట్రం నలుమూలలా చాటేలా 2012లో మొదటిసారిగా లేపాక్షి ఉత్సవాలను నిర్వహించారు. అప్పట్లో స్థానికంగా పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటక అతిథిగృహాన్ని నిర్మించారు. అనంతరం 2016లో ఎమ్మెల్యే బాలకృష్ణ సారథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అప్పట్లో ఆయన ఇచ్చిన హామీమేరకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందేలా కేంద్రం నుంచి సంకేతాలు అందాయి.

గుర్తింపునకు బీజం పడిందిలా... 
లేపాక్షికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకాంక్ష మేరకు ఇటీవల దిల్లీలో అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి, అమరావతి అభివృద్ది సంస్థ ఛైర్మన్‌ జాస్తి వీరాంజనేయులు ప్రధాని కార్యాలయ కార్యదర్శి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాకేష్‌తివారిని కలసి వినతిపత్రం అందించారు. లేపాక్షి చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు ఇచ్చేలా కేంద్ర పురావస్తుశాఖ వరల్డ్‌ హెరిటేజ్‌ డైరెక్టర్‌ లూర్దుస్వామి(హైదరాబాద్‌)కు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ తాహీరుకు లేపాక్షికి సంబంధించి గొప్ప చిత్రాలు, భౌగోళిక చిత్రపటం, చారిత్రక నేపథ్యం, చిత్రలేఖనాలువంటివి యునెస్కో నమూనాలో పంపమని ఆదేశాలు ఇచ్చింది. పంపిన వెంటనే జాబితాలో చేరుతుంది. ఇది శుభపరిణామమని త్వరలోనే లేపాక్షి ప్రపంచపటంలో స్థానం పొందనున్నట్లు జాస్తి వీరాంజనేయులు తెలిపారు.

Posted On 22nd March 2017

Source eenadu