20ల‌క్ష‌ల కారు 9ల‌క్ష‌ల‌కే...ద‌ళిత యువ‌త‌కు స‌బ్సిడీ
20ల‌క్ష‌ల  కారు 9ల‌క్ష‌ల‌కే...ద‌ళిత యువ‌త‌కు స‌బ్సిడీ

బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. అమరావతి సచివాలయంలోని  త‌న‌ కార్యాలయం వద్ద  దళిత యువతకు ఉపాధి కల్పనలో భాగంగా వాహనాల పంపిణీని సీఎం ప్రారంభించారు.  ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో  222 క్యాబ్స్ ఆయన ఈ సందర్భంగా పంపిణి చేశారు.

 రూ.20లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిష్ట ను రూ.16లక్షలకే వ‌చ్చేలా ప్ర‌భుత్వం  ఏర్పాటు చేసింద‌ని  చంద్రబాబు తెలిపారు.  అయితే, ఆ మొత్తం రూ.16 లక్షల్లోనూ రూ. 7లక్షల  సబ్సిడీని ప్రభుత్వం భరించనుంద‌న్నారు. దీంతో ల‌బ్ధిదారుడికి అంతిమంగా రూ.9ల‌క్ష‌ల‌కే కారు ద‌క్క‌నుంద‌న్న‌మాట‌! రూ. 30 కోట్ల పెట్టుబడితో ఈ వాహనాలను పంపిణి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఎప్పటికప్పుడు డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో  ఈ యువతను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కోవాహనం ద్వారా  నెల‌కు రూ. 12 వేలు నుంచి రూ.22 వేలు వరకు ఆదాయం లభిస్తుందన్నారు.  ఈ ఏడాది చివరిలోనే 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఏపీ షెడ్యూల్‌ కులాల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌, ముఖ్యకార్యదర్శి రావత్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Posted On 22nd March 2017

Source eenadu