ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ అందరికంటే మంచోడు - జగన్
ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ అందరికంటే మంచోడు - జగన్

టీడీపీ ఎమ్మెల్యేల్లో అత్యుత్తమ ఎమ్మెల్యే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి మూడునెలలకు ఓసారి టీడీపీ అధినేత చంద్రబాబు జరిపే సర్వేల్లో తెలిసిపోతుంది. అయితే అది ఆ పార్టీ వారికే పరిమితం. మరి ప్రతిపక్షానికి. ప్రతిపక్షనేత జగన్‌కు మాత్రం అత్యుత్తమమైన ఎమ్మెల్యే ఒకరున్నారు. జగన్‌కు నచ్చేలా ఆ ఎమ్మెల్యే ఏమి చేశారు. టీడీపీ వర్క్‌షాప్ జరిగిన ప్రతిసారి ముగింపులో ఎమ్మెల్యేల చేతుల్లో కవర్లుంటాయి. ఎవరి కవర్లో ఉన్న విషయాలు వారికి మాత్రమే తెలుస్తాయి. బయటివారికి తెలియవు. చంద్రబాబుకు తప్పా. అందులోర్యాంకులుంటాయి. పనితీరుపై మదింపుంటుంది. అన్ని విషయాలను బేరీజు వేసి ర్యాంక్ కూడా ఇస్తారు. ఇందులో వచ్చే ర్యాంకులను బట్టే ఎమ్మెల్యే ఉత్తముడుడో కాదో నిర్ణయించుకుంటారు. అయితే ఈ ర్యాంకులను వైసీపీ నేతలు ఎప్పుడూ విమర్శిస్తుంటారు. వారిలో వారు ర్యాంకులిచ్చుకుంటారని ఎద్దేవాచేస్తుంటారు. తక్కవ ర్యాంకులు వచ్చినట్లు మీడియా ప్రచారం జరిగిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుంటారు. అయితే వైసీపీలోనే ఒకరికి టాప్ ర్యాంక్ ఇచ్చారు. వైసీపీలో ఇతర నేతలు ఇలా ర్యాంకులిస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ ఈ ర్యాంకు ఇచ్చింది వైసీపీ అధినేత జగనే. ప్రతిపక్ష నేత చేత అత్యంత మంచోడు అనిపించుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత వైఎస్ జగన్‌కు కనిగిరి ఎమ్మెల్యే కదరి బాబురావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. జగన్‌ను చూసి పలకరింపుగా నవ్విన బాబురావుతో జగన్ సరదాగా మాట్లాడారు. అడగకుండానే టీడీపీ ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ అందరికంటే మంచోడని కితాబిచ్చారు. బాలకృష్ణ ఎవరినీ తిట్టరని, విమర్శలు చేయరని జగన్ ప్రశంసించారు. జగన్ ఈ విషయాన్ని బాబురావు వద్దే ప్రస్తావించడానికి కారణముంది. కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచిన బాబురావు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. వారిద్దరూ క్లాస్‌మెట్స్ అన్న ప్రచారం కూడా ఉంది. పైగా బాలకృష్ణ అభిమానసంఘాలను కూడా ఆయన సమన్వయం చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణను జగన్ ప్రశంసించిన విషయాన్ని తెలుసుకున్న పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని బాబురావు వద్ద ప్రస్తావించారు. నిజమేనా అంటూ ప్రశ్నించారు. నిజమేనని చెప్పిన బాబురావు మరికొన్ని ఆసక్తికర విషయాలను పయ్యవులకు వివరించారు. జగన్ బాలకృష్ణకు వీరాభిమానని గుర్తుచేశారు. గతంలో బాలకృష్ణ అభిమాన సంఘం కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని కేశవ్‌కు చెప్పారు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. కొత్త అసెంబ్లీలో ఇంతవరకు మాట్లాడలేదు. వైసీపీ దూకుడును అడ్డుకునే వ్యూహాల్లో బాలకృష్ణ ఇంకా భాగం కాలేదు. దీంతో సినిమాల్లోలాగా తమపై వీరావేశం చూపించలేదని జగన్ భావించారేమో కానీ బాలకృష్ణకు చాలా మంచోడిగా మార్కులేశారు జగన్.

Posted On 22nd March 2017

Source andhrajyothi