వేటగాడు...తెలంగాణ మంత్రి కొడుకు ?
వేటగాడు...తెలంగాణ మంత్రి కొడుకు ?

చెంగున ఎగురుతూ అందంగా అమాయకంగా కనపడే ఈ దుప్పులను చంపిందెవరు? చిన్నపాటి అలికిడికే చిగురుటాకుల్లా వణికిపోయే ఈ భీతహరిణాలను పరిగెత్తించి, వెంటాడి, వేటాడి.. తూటాలు దింపి, నిర్దాక్షిణ్యంగా వాటి గొంతులు కోసిందెవరు? కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వాటిని అత్యంత కిరాతకంగా కారు వెనక భాగంలో కట్టుకుని వెళ్తూ అడ్డగించిన అటవీ అధికారులకూ తుపాకీ గురిపెట్టి బెదిరించిన వారెవరు? మహదేవపూర్‌ అడవుల్లో దుప్పుల వేటలో కీలక వ్యక్తులెవ రు? రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడే ఈ హంటర్‌ మాఫియా లీడరా? అతడి ముఠా తరచూ హైదరాబాద్‌ నుంచి వచ్చి మహదేవ్‌పూర్‌ అడవుల్లో వేటాడుతూ ఉంటుం దా!? వన్యప్రాణుల వేట జరిగిన తెల్లవారి స్థానిక గులాబీ నేత ఇంట్లో ఈ ముఠా విందు వినోదాల్లో మునిగి తేలిందా!? ప్రభుత్వంలో కీలక వ్యక్తి నుం చి వచ్చిన ఒత్తిళ్లతో అసలు నిందితులను కేసులో చేర్చేందుకు పోలీసులు వెనకాడుతున్నారా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అంటున్నాయి అత్యంత విశ్వసనీ య వర్గాలు. దారుణం జరిగి నాలుగు రోజులు గడిచినా నిందితులను గానీ కనీసం కారులో దొరికిన ఆధార్‌ కార్డు ఆధారంగా కారు యజమానిని గానీ పోలీసులు, అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకోకపోవడం అనుమానాలు కలిగిస్తోంది.

 

ఇదీ జరిగింది.. 

ఆదివారం అర్ధరాత్రి జయశంకర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అంబట్‌పల్లి, సురారం సమీపంలోని అడవుల్లో వన్యప్రాణుల వేట సమాచారం అందుకున్న రేంజ్‌ అధికారి రమేశ్‌ ఆధ్వర్యంలో సూరారం, అంబట్‌పల్లి శివా రు అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇంతలో ‘ఏపీ 13 ఏఈ 2752’ నంబర్‌ ఇండికా విస్టా వాహనం అధికారుల వాహనాన్ని ఢీకొట్టింది. విస్టాలోంచి దిగిన ఐదుగురు దుండగులు అధికారులను తుపాకీతో బెదిరించి వేరే వాహనంలో పారిపోయారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్‌ చేరుకుని విచారణ చేపట్టారు. అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్‌ సీఐ చంద్రభాను తెలిపారు. కాగా.. మూడు వాహనాల్లో వచ్చిన 15 మంది హంటర్స్‌తోపాటు కొందరు స్థానికులు ఐదు దుప్పులను వేటాడినట్లు సమాచారం.

 

అధికారులు స్వాధీనం చేసుకుంది ఇండికా కారును, అందులోని రెండు దుప్పి కళేబరాలను మాత్రమే. పరారైన మిగతా రెండు వాహనాల గురించి స్థానిక పోలీసులకు ఆ రాత్రి ఎందుకు సమాచారం ఇవ్వలేదనే అంశం చర్చనీయాంశమైంది. ఇండికా కారు యజమాని ఫజల్‌ అహ్మద్‌ఖాన్‌(ఆధార్‌ కార్డు ఉండటంతో), మరో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్‌ 9, 39, 50, 51, 55; ఏపీ ఫారెస్ట్‌ చట్టం, 1969 ప్రకారం కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఎవరినీ అరెస్టు చేయలేదని, నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

టీఆర్‌ఎస్‌ నేతే హంటర్‌ లీడరా..? 
వన్యప్రాణుల వేట వెనుక టీఆర్‌ఎ్‌సలోని ఓ కీలక నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహదేవపూర్‌ మండలానికి చెందిన ఓ మండల నాయకుడికి హైదరాబాద్‌లో ఉండే మంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్‌ తర్వాత కేబినెట్‌లో కీలకమైన పోస్టులో ఉన్న ఆ నేత కుమారుడు దుప్పులను వేటాడినట్లు ప్రచారం జరుగుతోంది. అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న కారులో విమానం టికెట్లు కూడా దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరు, ముంబైలతోపాటు విదేశాలకు కూడా దుప్పి మాంసాన్ని ఎగుమతి చేసి ఈ ముఠా సొమ్ము చేసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. గతంలో దుప్పులతోపాటు నెమలి, జింక వంటి వన్యప్రాణులను ఈ ముఠా వేటాడినట్లు ప్రచారం జరుగుతోంది. 

విదేశాలకు వన్యప్రాణుల మాంసం! 
అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న కారులో విమానం టికెట్లు కూడా దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ టికెట్లను అధికారులు సీజ్‌ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరు, ముంబైలతోపాటు విదేశాలకు కూడా దుప్పి మాంసాన్ని ఎగుమతి చేసి ఈ ముఠా సొమ్ము చేసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. గతంలో దుప్పులతోపాటు నెమలి, జింక వంటి వన్యప్రాణులను ఈ ముఠా వేటాడినట్లు ప్రచారం జరుగుతోంది.

Posted On 24th March 2017

Source andhrajyothi