ఆండ్రాయిడ్‌ కొత్త ఓఎస్‌ ‘ఓరియో’...ఫీచర్స్ ఇవే
ఆండ్రాయిడ్‌ కొత్త ఓఎస్‌ ‘ఓరియో’...ఫీచర్స్ ఇవే

కొత్త మొబైల్‌ మార్కెట్‌లోకి వస్తోందంటే ఎంత సందడి ఉంటుందో, కొత్త ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లాంచ్‌ అవుతోందంటే అంతే సందడి ఉంటుంది. దానికి పేరు నిర్ణయించే ప్రక్రియ నుంచి ఫీచర్ల వరకు అన్నీ ఆసక్తికరమే. ఆండ్రాయిడ్‌ నుంచి త్వరలో రాబోతున్న కొత్త ఓఎస్‌కు ‘ఓరియో’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డెవలపర్ల కోసం కొత్త ఓఎస్‌ ప్రివ్యూ వెర్షన్‌ను విడుదల చేశారు. మే 17 నుంచి 19 వరకు కాలిఫోర్నియాలో జరగబోయే గూగుల్‌ వార్షిక ఐ/ఓ కాన్ఫరెన్స్‌లో వినియోగదారుల వెర్షన్‌ విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త ఓఎస్‌లో ఉన్న ఆప్షన్‌లేంటో చూద్దామా!

* సమయం, వాతావరణం, ప్రాంతానికి తగ్గట్టు ఐకాన్ల మీద థంబ్‌ నెయిల్‌ మారేలా అడాప్టివ్‌ ఆప్‌ ఐకాన్స్‌ సాంకేతికత ఉండబోతోందట. ఉదాహరణకు క్యాలెండర్‌ ఆప్‌ ఐకాన్‌లో ఉదయం పూట సూర్యుని బొమ్మ, రాత్రి చంద్రుని బొమ్మ కనిపించేలా మార్పులు చేస్తారు. దీంతోపాటు తేదీ కూడా మారుతుంది. అంతేకాదు ఐకాన్ల బొమ్మల్ని మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.

* ఆప్‌ లేదా బ్రౌజర్‌ పేజీలో అక్షరాలను కాపీ చేద్దామంటే దాన్ని జాగ్రత్తగా సెలెక్ట్‌ కాపీ చేయాలి. అంత జంఝాటం లేకుండా తెర మీది అక్షరాలను కాపీ చేసుకునేలా స్మార్ట్‌ సెలక్షన్‌ ఫీచర్‌ ఉండబోతోందట. అలా కాపీ చేసుకున్న మేటర్‌ మీ క్లిప్‌బోర్డులో ఆటోమేటిక్‌గా సేవ్‌ అయిపోతుంది. దాన్ని మీకు కావల్సిన దగ్గర పేస్ట్‌ చేసుకోవచ్చు.

* పిక్సల్‌ లాంచర్‌లోనూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇకపై ఆప్‌ డ్రాయర్‌ను ఓపెన్‌ చేయడానికి మెనూ ఐకాన్‌ను ఒత్తాల్సిన అవసరం లేదు. స్క్రీన్‌పై ఏ మూల స్వైప్‌ చేసినా ఆప్‌ డ్రాయర్‌ ఓపెన్‌ అవుతుంది.

* బ్యాక్‌గ్రౌండ్‌లో ఆప్‌లు రన్‌ కాకపోతే ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు రావు. అలా రన్‌ చేస్తే బ్యాటరీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇబ్బందిని తొలగించేలా బ్యాక్‌గ్రౌండ్‌ ఎగ్జిక్యూషన్‌ లిమిట్స్‌ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఆప్‌లు రన్‌ అయ్యే విధానంలో మార్పులొస్తాయి. దీంతోపాటు ఆప్స్‌ మీ లొకేషన్‌ను యాక్సెస్‌ చేసే సమయాన్ని కూడా తగ్గించారు. దీని వల్ల బ్యాటరీ వినియోగం తగ్గుతుంది.

* రెండు ఆండ్రాయిడ్‌ మొబైళ్లను కనెక్ట్‌ చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఆ రెండూ ఒకే వైఫై పరిధిలో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు వైఫై అవేర్‌ సాంకేతికత ద్వారా ఆ రెండూ ఒకే నెట్‌వర్క్‌ పరిధిలో లేకపోయినా అనుసంధానం చేసుకోవచ్చు.

* నోటిఫికేషన్లను నిర్ణీత సమయం వరకు నిలిపేసే ఆప్షన్‌ ఉండబోతోంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, వాట్సాప్‌ ఇలాంటి ఆప్షన్‌ అందిస్తున్నాయి. దీంతోపాటు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఆప్‌లు, జీమెయిల్‌ల నోటిఫికేషన్‌లు కేటగిరీ ప్రకారం కనిపిస్తాయి. ఉదాహరణకు జీమెయిల్‌లో సాధారణ మెయిళ్ల నోటిఫికేషన్లు, ప్రయారిటీ ఇన్‌బాక్స్‌లోని మెయిళ్ల నోటిఫికేషన్లు వేర్వేరుగా కనిపిస్తాయి.

* ఆండ్రాయిడ్‌ నూగట్‌లో మొబైల్‌ తెరపై ఒకేసారి పక్కపక్కన రెండు ఆప్‌లు ఓపెన్‌ చేసుకోవచ్చు. అంటే తెర రెండు భాగాలుగా కనిపిస్తుంది. కొత్త ఓఎస్‌లో ఒకేసారి రెండు ఆప్‌లు వాడుకో వచ్చు. అంటే ఫేస్‌బుక్‌ చూస్తూనే యూట్యూబ్‌లో వీడియోలు వీక్షించొచ్చు. దీన్ని పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌ అంటారు.

* ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో ఇప్పటివరకు మొబైల్‌ను అన్‌లాక్‌ చేసుకోగలుగుతున్నారు. కొత్త ఓఎస్‌లో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ కాల్స్‌ అటెండ్‌ చేయొచ్చు. స్కానర్‌పై వేలితో స్వైప్‌ చేస్తే కాల్‌ కనెక్ట్‌ అయిపోతుంది. లాక్‌ స్క్రీన్‌లో షార్ట్‌కట్‌లుగా కెమెరా, ఫోన్‌ షార్ట్‌కట్‌ మాత్రమే ఉండేవి. ‘ఆండ్రాయిడ్‌ ఓ’లో మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు.

Posted On 25th March 2017

Source eenadu