‘కంగారు’ పెట్టించిన కుల్‌దీప్‌
‘కంగారు’ పెట్టించిన కుల్‌దీప్‌

 కెరీర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేటప్పుడు క్రీడాకారుడికి ఉండే ఉద్విగ్నతే వేరు! సీనియర్ల మధ్యన కాస్త బిడియం.. జట్టులో చోటు దక్కినందుకు సంతోషం.. మనసులో ఉద్విగ్నత.. సత్తా చాటుకోవాలన్న తాపత్రయం ఉంటాయి. బ్యాట్స్‌మన్‌కైతే అరంగేట్రంలోనే అర్ధశతకమో, శతకమో సాధించాలన్న కోరిక ఉంటుంది. అదే బౌలర్‌కైతే ప్రత్యర్థి జట్టు ఒక్క వికెట్‌నైనా పడగొట్టాలన్న తపన ఉంటుంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి అరంగేట్రంలోనే సత్తా చాటాడు యువ ఆటగాడు కుల్‌దీప్‌ యాదవ్‌. తొలి వికెట్‌గా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపించడం గొప్ప మధురానుభూతి. వార్నర్‌ను క్యాచ్‌ఔట్‌ రూపంలో బలిగొంటే హ్యాండ్స్‌కాంబ్‌, మాక్స్‌వెల్‌ను రెండు చక్కని బంతులకు అంతుచిక్కని రీతిలో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కమిన్స్‌ను ఏకంగా కాట్‌ అండ్‌ బౌల్‌ చేశాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుత గణాంకాలు (4/68) నమోదు చేసిన టీమిండియా తొలి చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ ఇప్పుడు పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ ‘చైనామన్‌’ ప్రస్థానం తెలుసుకొంటే..

అలా మొదలైంది 
ఉత్తర్‌ప్రదేశ్‌ రంజీ ఆటగాడైన కుల్‌దీప్‌ చిన్నప్పుడు కాన్పూర్‌లోని క్రికెట్‌ అకాడమీలో ఫాస్ట్‌బౌలర్‌గా ప్రవేశించాడు. కోచ్‌ కపిల్‌ పాండే అరుదైన చైనామన్‌ బౌలింగ్‌కు మారమని సలహా ఇచ్చాడు. అయిష్టంతో తను కన్నీరు పెట్టుకొన్న సందర్భాలూ ఉన్నాయి. చివరికి చైనామన్‌ శైలి విశిష్టతా, దిగ్గజాల సరసన తన పేరు చేరుతుందని తెలిసి ఇష్టం పెంచుకొన్నాడు. ఎడమ చేతితో తక్కువ వేగంతో లెగ్‌స్పిన్‌ వేయడమే చైనామన్‌ శైలి.పట్టు దొరికింది! 
చైనామన్‌ బౌలింగ్‌లో పట్టు సాధించిన కుల్‌దీప్‌ 17 ఏళ్ల వయసులో 2012, ఏప్రిల్‌లో భారత అండర్‌-19 జట్టులో ఆడాడు. ఐతే 2014 అండర్‌-19 ప్రపంచకప్‌లో గుర్తింపు లభించింది. టోర్నీలో స్కాట్లాండ్‌పై హ్యాట్రిక్‌ ఘనత సాధించాడు. 6 మ్యాచుల్లో 14 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌-2012లో ముంబయి ఇండియన్స్‌ సభ్యుడైన కుల్‌దీప్‌ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. దీంతో 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారాడు. అరంగేట్రం మాత్రం గతేడాది ఐపీఎల్‌లోనే సాధ్యమైంది. మూడు మ్యాచ్‌లాడి 6 వికెట్లు తీశాడు.దులీప్‌ ట్రోఫీలో సత్తా 
దులీప్‌ ట్రోఫీలో 2016లో కుల్‌దీప్‌ సత్తా చాటాడు. ఇండియా రెడ్‌ తరఫున మూడు మ్యాచుల్లోనే 17 వికెట్లు తీసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇండియా గ్రీన్‌పై 9/120తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. కుల్‌దీప్‌ ప్రతిభను గుర్తించిన భారత స్పిన్‌ దిగ్గజం ఎర్రాపల్లి ప్రసన్న అతడిని ‘భారత బ్రాడ్‌హగ్‌’ అని అన్నాడు. టీమిండియా 2016లో సుదీర్ఘ హోమ్‌సీజన్‌ ఆడనుంది కాబట్టి కుల్‌దీప్‌కు జాతీయ జట్టులో అవకాశం రావొచ్చని దిగ్గజ స్పిన్నర్‌ వెంకటపతి రాజు ముందుగానే అంచనా వేశాడు. జట్టులో ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లుంటే టెస్టుల్లో తొందరగా 20 వికెట్లు పడగొట్టొచ్చని అన్నాడు.

గణాంకాలు భేష్‌
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కుల్‌దీప్‌ గణాంకాలు బాగున్నాయి. 22 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 3.77 ఎకానమీతో 81 వికెట్లు తీశాడు. నాలుగు వికెట్ల ఘనత ఐదుసార్లు, ఐదు వికెట్ల ఘనత 3 సార్లు సాధించాడు. పది లిస్ట్‌-ఏ మ్యాచుల్లో 14, 27 టీ20 మ్యాచుల్లో 37 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. బ్యాట్స్‌మన్‌గానూ ఫర్వాలేదనిపించాడు. 29 ఫస్ట్‌క్లాస్‌ ఇన్నింగ్సుల్లో 723 పరుగులు చేశాడు. ఒక శతకం, 5 అర్ధశతకాలు సాధించాడు. అత్యధిక స్కోరు 117.

Posted On 25th March 2017

Source eenadu