‘చైనామ్యాన్’ బౌలర్ అంటే ?
‘చైనామ్యాన్’ బౌలర్ అంటే ?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే అతని బౌలింగ్ తీరులో విశేషముంది. అతను ఎడమచేత్తో లెగ్ స్పిన్ వేస్తాడు. ఇలాంటి బౌలర్లు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు చాలా తక్కువ మంది(28) మాత్రమే ఉన్నారు. అయితే భారత్ తరుపున ఆ విధమైన మొట్టమొదటి బౌలర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే. ఇలాంటి బౌలర్లను లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్లని అంటారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ ‘చైనామ్యాన్’ బౌలర్లని అని కూడా అంటారు.

అయితే ఈ ‘చైనామ్యాన్’ అనే పదం ఎలా పుట్టిందనేది ఆసక్తికరమైన అంశం. 1933లో ఆతిద్య జట్టు ఇంగ్లండ్, పర్యాటక జట్టు వెస్టిండీస్‌కు మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 375 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను విండీస్ పేసర్ మన్నీ మార్టిన్‌డేల్ పెవీలియన్ బాట పట్టించాడు. కానీ ఏడో వికెట్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ డగ్లస్ జర్డైన్, వాల్టర్ రాబిన్స్ 140 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ సమయంలో సెంచరీకి దగ్గరగా ఉన్న రాబిన్స్‌ను విండస్ బౌలర్ ఎల్లిస్ అచోంగ్ అద్భుతమైన బంతితో స్టంపౌట్ అయ్యేలా చేశాడు. దీంతో రాబిన్స్ పెవీలియన్‌కు వెళుతూ బ్లడీ ‘చైనామ్యాన్’ వెరైటీ బంతి వేశాడని తిట్టుకుంటూ వెళ్లాడట. వెస్టిండీస్ తరుపున ఆడిన బౌలర్ ఎల్లిస్ అచోంగ్ క్రికెట్‌లో మొదటి చైనా దేశ ఆటగాడు. దీంతో అప్పటి నుంచి ఇలా ఎడమచేత్తో లెగ్ స్పిన్ వేస్తున్న బౌలర్లను ‘చైనామ్యాన్’ బౌలర్లని పిలుస్తున్నారు.

Posted On 25th March 2017

Source andhrajyothi