బాబు దెబ్బతో...క్షమాపణ చెప్పిన నాని, బోండా ఉమ
బాబు దెబ్బతో...క్షమాపణ చెప్పిన నాని, బోండా ఉమ

ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం, అధికారులకు కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా క్షమాపణ చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలో ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. సీఎం జోక్యంతో తాము క్షమాపణ చెప్పేందుకు సిద్ధపడినట్లు చెప్పారు. ఘటనలో తప్పు ఎవరిదైనా భేషజాలకు పోకుండా దిగొచ్చామన్నారు.

అంతకుముందు తెదేపా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నిన్నటి ఘటనపై వివరణ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్నందున నేతలు జాగ్రత్తగా ఉండాలని.. అనవసర వివాదాలు తెచ్చుకోవద్దని సీఎం సూచించినట్లు నేతలు చెప్పారు. సీఎం సూచన మేరకు రవాణాశాఖ అధికారులకు క్షమాపణ చెప్పేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.

అధికారుల హెచ్చరిక 
అంతకుముందుకు రవాణాశాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల తీరుపై మండిపడ్డారు. ఘటనకు కారణమైన ప్రజాప్రతినిధులు క్షమాపణ చెప్పకపోతే సోమవారం నాడు పెన్‌డౌన్‌ చేస్తామని హెచ్చరించారు. ఆటోనగర్‌లో జరిగిన రోడ్డుప్రమాదానికి సంబంధించి నివేదిక మార్చాలని కొందరు ఒత్తిడి తెచ్చారని.. సాధ్యం కాదని కమిషనర్‌ చెప్పడంతో ప్రజాప్రతినిధులు కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేసినట్లు అధికారి ప్రసాదరావు తెలిపారు. రవాణాశాఖ అధికారులను అవినీతిపరులుగా వ్యాఖ్యానించిన వారు.. ఎవరికి ఎంతెంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ కేశినేని నానిపై అధికారులు తీవ్రంగా మండిపడ్డారు. ఒక బస్సు ప్రమాదం విషయంలో మరో బస్సు ఆపరేటర్‌ ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. ఐజీ స్థాయి అధికారిని రోడ్డుపై నిలబెడితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Posted On 26th March 2017

Source eenadu