కీరవాణి సంచలన ట్వీట్లు
కీరవాణి సంచలన ట్వీట్లు

తన సంగీతంతో సినీ అభిమానులను విశేషంగా అలరించిన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. ‘మనసు మమత’ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 27ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో కీలక మైలురాళ్లను అందుకున్నారు. అద్భుతమైన పాటలతో తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి ది: కన్‌క్లూజన్‌’ చిత్రానికి ఆయన స్వరాలు సమకూర్చారు. సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటానంటూ రెండేళ్ల క్రితం ప్రకటించిన కీరవాణి ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు. సంగీత దర్శకుడిగా తన సినీ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ‘నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది నా నిర్ణయం. నా శ్రేయోభిలాషులకు శుభవార్త. నాపై వారు చూపిన ప్రేమ.. సహకారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని ట్వీట్‌ చేశారు. అంతకుముందు తన కెరీర్‌, ప్రస్తుతం సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అవి.. 
* నా జీవితం మౌళి సర్‌తో మొదలైంది. 27ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను రాజమౌళితో ఉన్నాను. 
* దేవుడు నాకు జయాపజయాలు రెండూ ఇచ్చాడు. ఈ విషయంలో ఎలాంటి బాధా లేదు. ప్రతిసారీ ఓ పాఠం నేర్చుకున్నా. 
* నేను రాజమౌళితో ఉన్నంతకాలం అతన్ని ఎవరూ అందుకోలేరు. కానీ సినిమాల నుంచి విశ్రాంతి తీసుకునే సమయం నాకోసం ఎదురుచూస్తోంది. ఈ విషయం రెండేళ్ల క్రితం ప్రకటించాను. దీనికి మిశ్రమ స్పందన లభించింది.

* నేను సినిమాల నుంచి దూరం కాకూడదని 99 శాతం మంది కోరుకున్నారు. అందులో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఉన్నారు. కొందరు మాత్రం సంతోషంగా ఉన్నారు. 
* నా రిటైర్‌మెంట్‌పై ధైర్యంగా, నేరుగా మద్దతు తెలిపిన వ్యక్తి అనంత శ్రీరామ్‌ ఒక్కడే. 
* తమన్‌ ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. నా సహాయకుడు జీవన్‌ను ఒకటికి పదిసార్లు ఆ విషయం గురించి అడిగాడు. తమన్‌ నాకు వీరాభిమాని. మంచి ప్రోగ్రామర్‌ అయిన జీవన్‌ అతనికి కావాలి.

* బుర్రలేని చాలామంది దర్శకులతో నేను పనిచేశాను. వారు నా మాటలు వినేవారు కాదు. రాజమౌళి సినిమాలకు మాత్రమే అద్భుతమైన సంగీతం అందించడానికి కారణం అతను నేను చెప్పేదీ ప్రతిదీ వినేవాడు. 
* చాలామంది దర్శకులు నన్నో సంగీత దర్శకుడిగా మాత్రమే చూసేవారు. మంచి సలహా తీసుకోవడంలో మాత్రం శ్రద్ధ కనబరిచేవారు కాదు. దర్శకులు కథ చెప్పే సమయంలోనే ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందని నేను అంచనా వేసే వాడిని. కానీ దర్శకులు వినేవారు కాదు.

* వినకపోవడం అనేది మంచి ట్యూన్లకు ఎలాంటి హానీ చేయదు. కానీ మంచి సలహాను పెడచెవిన పెడితే అది డైరెక్టర్‌కు కచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుంది. అతని చిత్రంతో పాటు, వ్యక్తిగత కెరీర్‌పైనా చెడు ప్రభావం చూపుతుంది. 
* ఒకవేళ నేను నా కెరీర్‌ కొనసాగించాల్సి వస్తే నా శ్రేయోభిలాషుల కోసం పనిచేస్తా. అంతేకానీ నా మాటను వినిపించుకోని, పట్టించుకోని వారి కోసం చేయను. ఎందుకంటే సంగీత దర్శకుడిగా నేనెప్పుడూ గర్వంగా ఫీల్‌ కాలేదు. నాలో ఉన్న రచయితను చూసి గర్వపడతా.

* ‘బాహుబలి 1’ భారీ విజయం సాధిస్తుందని ఎవరూ వూహించలేదు. డైరెక్టర్‌, నిర్మాతలు, వారాహి సాయిగారితో సహా. అయితే అంబికా కృష్ణ సానుకూలంగా ఉన్నారు. నేను మాత్రం చాలా నమ్మకంగా ఉన్నా. 
* క్రాంతికుమార్‌కు అహంకారం ఎక్కువ. కానీ టాలెంట్‌ను గౌరవించే వారు. రాజమౌళి కీర్తిని చూసి ఆయన గర్వ పడాలి. తెలుగు సినీ నిర్మాత గర్వపడే వ్యక్తి క్రాంతికుమార్‌. ఆయన ఎన్నటికీ విదూషకుడు కాదు.

* ఆర్కా నిర్మాతలు నా కుటుంబ సభ్యులు. వారు లేకుండా భారతదేశం గర్వించదగ్గ ఈ చిత్రం రూపుదిద్దుకునేది కాదు. 
* ‘క్షణ క్షణం’లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను మాత్రమే అంగీకరించాలని రాముగారు(రాంగోపాల్‌వర్మ) నాతో అనేవారు. కానీ నేను ఆయన మాట వినలేదు. నాకున్న కుటుంబ బాధ్యతల దృష్ట్యా నా తలుపుతట్టిన ప్రతి అవకాశాన్నీ అంగీకరించా. ‘చవుకబారు సంస్థలతో సినిమాలు చేయవద్దు’ అని ఆర్‌జీవీ ఇచ్చిన సలహాను ఆయనే ఆచరణలో పెట్టలేకపోయారు. అన్ని అపజయాలు ఎదురైనా ఇప్పటికీ ఆయనే జీనియస్‌. ‘జామురాతిరి’ పాట ఎవర్‌గ్రీన్‌ 
* రాఘవేంద్రరావు నా గాడ్‌ఫాదర్‌. ‘పెళ్లిసందడి’ లాంటి సాంఘిక చిత్రాలపై ఆయన దృష్టి సారించాలని కోరుకుంటున్నా.

* రాజమౌళి స్థాయిని ఎవరూ అందుకోలేరు. సినిమాపై ఆరాధన, ప్యాషన్‌ అతనికి చివరి వరకూ ఉంటుంది. ఇది వందశాతం నిజం. ఇది నా వేదవాక్కు. రాజమౌళి తర్వాత నా ఆశలన్నీ కాంచీపైనే. నా అభిప్రాయాలు అతనితో వందశాతం కలుస్తాయి. 
* వేటూరిగారి నిష్క్రమణ, సిరివెన్నెల అనారోగ్యం కారణంగా తెలుగు సినీ గేయ సాహిత్యం నిద్రాణావస్థలోకి వెళ్లిపోయింది.
* నా తండ్రి చాలా గొప్ప ఆర్టిస్ట్‌. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుమారుడినైనందుకు గర్విస్తున్నా. ఆయన గొప్ప సంస్కృత గీత రచయిత. కానీ ఆయన సినిమా ‘చంద్రహాస్‌’ అంటే నాకు ఇష్టం ఉండదు.

* నా క్రమశిక్షణ, నా భార్య సహకారంతో సినీ పరిశ్రమలో గొప్ప గౌరవాన్ని దక్కించుకున్నా. ఆమే నా శివగామి. నేను సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవడం నా భార్యకు కూడా ఇష్టం లేదు. కానీ నేను దానిపై నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా. 
* నా అభిమానులంటే నాకు అమితమైన ప్రేమ. తిరుమల భక్తుల నుంచి జీసెస్‌ ఫాలోవర్ల స్థాయి వారిది. 
* కష్టసుఖాల్లో నాగార్జున గారు నా చేయి విడిచిపెట్టలేదు. ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను.

* నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, గురువులకు, సహాయకులకు, అభిమానులకు, అందరికీ ధన్యవాదాలు. 
* రామోజీరావుగారికి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటా. ఆయనతో పాటు కృష్ణంరాజు గారు, రాఘవేంద్రరావు గారు, బాలచందర్‌ గారు, మహేష్‌భట్‌గారికి కూడా కృతజ్ఞుడిని. 
* ఒకవేళ నేను సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తే నా ట్యూన్స్‌కి ఎవరూ బాస్‌లు ఉండరు. చివరికి డైరెక్టర్లు కూడా. నాకు నేను యజమానిని. నా బాధ్యతను మరింత పెంచుకుంటా. 
* ఏ డైరెక్టర్‌ అయినా మ్యూజిక్‌ కంపోజర్‌ని తన సహాయకుడిగా ఎందుకు భావించరో నాకర్థంకాదు. సినిమాల్లో నేను కొనసాగే అవకాశం చాలా తక్కువ. టాలీవుడ్‌లో చాలామంది డైరెక్టర్లకు బుర్రలేదు.

Posted On 26th March 2017

Source andhrajyothi