బొజ్జ తగ్గాలనుకుంటున్నారా ? ఇలా రోజూ చేస్తే బొజ్జ కరిగిపోతుంది
బొజ్జ తగ్గాలనుకుంటున్నారా ? ఇలా రోజూ చేస్తే బొజ్జ కరిగిపోతుంది

నా వయసు 39, ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు, బరువు 96. ఈ స్థూలకాయంతో వాకింగ్‌ చేయడం కూడా కష్టంగానే ఉంటోంది. పైగా సొంత వ్యాపారం కాబట్టి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల దాకా క్షణం తీరిక లేకుండా ఉంటాను. రోజు రోజుకూ పెద్ద బొజ్జ ఏర్పడుతోంది. అయితే, జిమ్‌లు, రన్నింగ్‌లు కాకుండా సులభమైన మార్గంలో బరువు తగ్గే సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి.
- ఎన్‌ సూర్యప్రకాశ్‌, విశాఖపట్నం

వ్యాయామం అసలే చేయనంటే కుదరదు. అయితే ఎంతో కొంత వ్యాయామం చేస్తూనే ఈ కింది సూచనలు పాటిస్తే మీ బరువు క్రమంగా తగ్గుతారు. ఎలాగంటే..

    అల్లం, ఊబకాయాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది అల్లంలో కొవ్వును కరిగించే అంశాలతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేసే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందుకోసం అల్లాన్ని దంచి రసం తీయాలి. ఆ రసాన్ని పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. పాత్రలో ఎంత అల్లం రసం ఉంటే దానికి సమానంగా తేనె కలిపి, మళ్లీ కాసేపు పొయ్యి మీద ఉంచి దించేయాలి. చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేయాలి. అందులోంచి ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్‌ రసం తీసుకుని, గ్లాసు వేడి నీళ్లు కలిపి భోజనానికి ముందు సేవించాలి. ఇలా రోజూ చేస్తే బొజ్జ కరిగిపోవడం మొదలవుతుంది..
    జీలకర్రను రుచికోసం తప్ప అందులోని ఔషధ గుణాల్ని పెద్దగా పట్టించుకోం. అయితే భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత రోజూ తింటే, జీర్ణక్రియ సవ్యంగా జరిగి క్రమంగా బరువు తగ్గుతారు.
    పసుపులో ఉండే కర్‌క్యూమిన్‌ గొప్ప యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ- ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులోని గుణాలు రక్తకణాల్లో అడ్డుపడే కొవ్వు కణాలు విస్తరించకుండా అడ్డుపడతాయి. ఇది అల్లంలాగే పనిచేస్తుంది. బరువు పెరగకుండా అరికడుతుంది. అందువల్ల రోజూ పరగడుపున ఒక చిన్న పసుపు ముద్దను మింగడం మేలు.
    కొవ్వు కరిగించి, బరువు తగ్గించే మరో దినుసు దాల్చిన చె క్క. ఇది శరీర బరువును తగ్గించడంతో పాటు రక్తంలోని చక్కెర నిలువల్ని కూడా తగ్గిస్తుంది.
    నల్ల మిరియాల్లోని పెవరీన్‌ కొవ్వుతో శక్తివంతంగా పోరాడుతుంది. కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుపడుతుంది.
    వీటిని పాటించి చూడండి కొద్ది కాలంలోనే ఫలితం కనిపిస్తుంది. కాకపోతే, వ్యాపారం కోసం 12 గంటలు కేటాయించడం ఇప్పుడు బాగానే ఉంది. ఆ కారణంగా శరీర శ్రమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ పోతే శరీరం రోగగ్రస్తమై ఒక దశలో 6 గంటలు కూడా పనిచేయలేని స్థితి ఏర్పడుతుంది. అందువల్ల శరీర వ్యాయామానికి మీరు ఎంతో కొంత సమయం కేటాయించక తప్పదు.

- డాక్టర్‌ ఎస్‌ ఉదయభాస్కర్‌, ఆయుర్వేద వైద్యులు

Posted On 15th June 2017

Source andhrajyothi