యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం - మోదీ
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం - మోదీ

యోగా ద్వారానే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని రమాబాయ్‌ అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించిన యోగా వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ఔత్సాహికులతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. యోగాతో పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చన్నారు. యోగా సాధన రుషులు, మహర్షుల నుంచి సామాన్యుల వరకు అందరికీ ఉపయోగకరమన్నారు. యోగా వల్ల ప్రపంచమంతా భారత్‌తో మిళితమైందన్నారు. యోగా శిక్షకులకు అద్భుత అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం.. అది యోగా వల్లనే సాధ్యమవుతుందని మోదీ పేర్కొన్నారు.

వర్షంలోనే యోగాసనాలు 
లఖ్‌నవూలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. అయినప్పటికీ మోదీ సహా ప్రముఖులు, ఔత్సాహికులు వర్షంలోనే యోగసనాలు వేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యోగా చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మోదీ అభినందనలు తెలిపారు.

Posted On 21st June 2017

Source eenadu