గ్రేట్ కాళీ తర్వాత... కవితా దేవి
గ్రేట్ కాళీ తర్వాత... కవితా దేవి

సల్వార్‌ కమీజ్‌ ధరించి వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో కుస్తీ పట్టిన భారత నారి కవితా దేవీ వీడియో సంచలనంగా మారింది. సంప్రదాయ దుస్తుల్లో ఆమె పోరాటం చూసి తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు నెటిజన్లు.

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారతీయుడిగా గ్రేట్‌ కాళీ సంచలనం సృష్టించాడు. హెవీ వెయిట్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హరియాణా రెజ్లర్‌ కవితా దేవీ అదే పనిచేసింది. అందులో అడుగుపెట్టిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. మే యంగ్‌ క్లాసిక్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ రెజ్లర్‌ కోటా కైతో తలపడింది. బరిలోకి దిగాక తలపడాల్సిందేగా! అంటారా! కానీ ఇక్కడ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది ఆమె వస్త్రధారణ. నారింజ రంగు సల్వార్‌ కమీజ్‌ ధరించిన కవిత నడుం చుట్టూ దుపట్టా కట్టుకొని కుస్తీ పట్టింది. ప్రత్యర్థిని తన కండబలంతో పైకి ఎగరేసి కింద పడేసింది. కొత్తగా వచ్చిన ఆమె కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఓడినా తన పోరాటంతో మెప్పించింది. ఆగస్టు 31న యూట్యూబ్‌లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అప్పుడే 30 లక్షల మంది వీక్షించారు. మీరూ ఓ లుక్కేయండి!

Posted On 5th September 2017

Source eenadu