HCA నిర్లక్ష్యంతో... హైదరాబాద్ పరువు గంగపాలు
HCA నిర్లక్ష్యంతో... హైదరాబాద్ పరువు గంగపాలు

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం.. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌! ఇప్పుడు ఇంకో అపప్రదను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మ్యాచ్‌ ఆతిథ్యం కట్టబెడితే నిర్లక్ష్యంతో ముంచేసింది. రోజంతా చినుకు పడకపోయినా మైదానాన్ని ఆటకు సిద్ధం చేయలేక క్రికెట్‌ ప్రపంచంలో నవ్వుల పాలైంది. అన్ని స్టేడియాలు అద్భుత ప్రమాణాలతో అందరి మన్ననలు పొందేందుకు పోటీపడుతుంటే.. కనీస ప్రమాణాలు పాటించని హెచ్‌సీఏ చేజేతులా మ్యాచ్‌ను నీరుగార్చింది!

హైదరాబాద్‌లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌.. పైగా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌.. ఇంతటి ముఖ్య మ్యాచ్‌ నిర్వహణను హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి! ఎంతో ఉత్సాహంగా మ్యాచ్‌ కోసం ఏర్పాట్లు చేయాలి! ఇలాంటి ఆలోచనలు కించిత్‌ కూడా లేని హెచ్‌సీఏ ఉత్తమ స్టేడియాల్లో ఒకటిగా పేరొందిన ఉప్పల్‌ మైదానం పరువు తీసింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తున్న మాట నిజమే అయినా స్టేడియం నిర్వహణ విషయంలో హెచ్‌సీఏపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో రెండో వన్డే కూడా అనుమానంగా కనిపించింది. మ్యాచ్‌కు ముందు రోజు వరకు అక్కడ కుండపోతగా వర్షం కురిసింది. అయినా మ్యాచ్‌ రోజు మధ్యాహ్నం మైదానం ఆటకు సిద్ధమైంది. మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ఆధ్వర్యంలో బెంగాల్‌ క్రికెట్‌ సంఘం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఎన్నో మార్పులు చేసింది. అత్యాధునిక మురుగునీటి వ్యవస్థతో పాటు ఔట్‌ఫీల్డ్‌ను సమర్థంగా నిర్వహించింది. ముందురోజు భారీ వర్షం కురిసినా.. మ్యాచ్‌ రోజు 2, 3 గంటల్లోనే మైదానాన్ని ఆటకు సిద్ధం చేసింది. మరికొన్ని రాష్ట్ర సంఘాలు కూడా మైదానం నిర్వహణలో మంచి సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. ఎటొచ్చి హెచ్‌సీఏనే దారుణంగా విఫలమైంది. బీసీసీఐ నిన్ననో మొన్ననో మ్యాచ్‌ను ప్రకటించలేదు. ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ ఉన్న సంగతి నెల రోజుల ముందే తెలుసు. ఐతే మ్యాచ్‌ కోసం స్టేడియాన్ని సిద్ధం చేసుకోవాల్సిన హెచ్‌సీఏ పరిపాలనను గాలికి వదిలేసింది. దేశంలో అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాల మాదిరే హెచ్‌సీఏకు కూడా కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. ఐతే.. అవినీతిలో సెంచరీలు కొడుతున్న హెచ్‌సీఏ పెద్దలు కనీస మౌలిక వసతుల్ని కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితమే శుక్రవారం నాటి అపప్రద.

నిజానికి ఉప్పల్‌ స్టేడియానికి మంచి పేరుంది. దేశంలో చాలా స్టేడియాల కంటే ఉప్పల్‌ స్టేడియంలో మంచి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఐతే పరిపాలనలో నిర్లక్ష్యంతో స్టేడియం నిర్వహణను పట్టించుకోవడం మానేశారు. హెచ్‌సీఏ కార్యవర్గంలో ఎవరున్నా కథంతా డబ్బుల చుట్టే తిరగడం ఎప్పుడూ కనిపించే సంస్కృతే. ఎప్పుడో 2002-03లో సిద్ధం చేసిన ఔట్‌ఫీల్డ్‌లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని స్టేడియాల ఔట్‌ఫీల్డ్‌లు ఇసుకతో రూపొందిస్తున్నారు. ఎంత భారీ వర్షం కురిసినా.. డ్రైనేజీల ద్వారా నీరు బయటకి వెళ్లిపోతుంది. గత కొంతకాలం వరకు ఉప్పల్‌లోనూ ఇలాంటి వ్యవస్థే ఉండేది. ఐతే క్రికెట్‌ రాజకీయాలు, నిధుల గోల్‌మాల్‌లో బిజీగా ఉన్న హెచ్‌సీఏ పెద్దలు స్టేడియాన్ని అస్సలు పట్టించుకోలేదు. దీంతో మైదానంలోని ఇసుక పూర్తిగా తొలగిపోయినట్లు తెలుస్తోంది! పైగా మైదానంలో కవర్స్‌ కప్పడంపైనా విమర్శలు వస్తున్నాయి. మైదానంలో 30 అడుగుల వృత్తం వరకు ఔట్‌ఫీల్డ్‌ బాగానే ఉంది. 30 అడుగుల తర్వాతే మైదానం పరిస్థితి దారుణంగా మారింది. అంటే.. గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తున్నా మైదానాన్ని కాపాడుకోడానికి హెచ్‌సీఏ సరైన ఏర్పాట్లు చేయలేదనే చెప్పాలి. ఈ మ్యాచ్‌కు ముందు జింఖానా మైదానంలో ఈనెల 6 నుంచి 9 వరకు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ జరిగింది. నాలుగు రోజుల మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. సీజన్‌లో మొదటి మ్యాచ్‌ కావడంతో హెచ్‌సీఏ పెద్దలంతా జింఖానా మైదానంలోనే మోహరించారు. జింఖానాను పూర్తిగా కవర్లతో కప్పేశారు. అదే సమయంలో ఉప్పల్‌ను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఫలితమే ప్రస్తుతం శుక్రవారం నాటి పరిస్థితి!

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ. ఐసీసీలోని అనుబంధ దేశాల్లో చాలావాటి కంటే ముందే రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ ఇచ్చే నిధులే ఎక్కువ. భారీ నిధుల్ని సద్వినియోగం చేస్తే స్టేడియాల్ని అద్భుతంగా నిర్వహించుకోవచ్చు. కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల్ని ఉపయోగించుకుని మైదానాల్ని సిద్ధం చేసుకోవచ్చు. ఐతే వచ్చిన నిధుల్ని వచ్చినట్లే స్వాహా అవుతున్నంత కాలం ఉప్పల్‌ స్టేడియం ఘటనలు జరుగుతూనే ఉంటాయి!

Posted On 14th October 2017

Source eenadu