పాక్‌ ను చిత్తు చేసి... ఫైనల్ కు భారత్
పాక్‌ ను చిత్తు చేసి... ఫైనల్ కు భారత్

ఆసియా కప్‌ హాకీలో భారత్‌ అదరగొట్టింది. గ్రూప్‌ దశను అజేయంగా ముగించిన మన్‌ప్రీత్‌ సేన ఒకే టోర్నీలో రెండోసారి దాయది పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. టోర్నీలో తన వీరోచిత ఫామ్‌ను ప్రదర్శిస్తూ శనివారం జరిగిన సూపర్‌-4 పోరులో పాక్‌పై 4-0తో విజయ దుందుభి మోగించింది. తనకు ఎదురేలేదని శాశ్వత శత్రువుకు చాటిచెప్పింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి ఎరగకుండా ఫైనల్‌ చేరింది.

చివరి 10 నిమిషాల్లో 
ప్రథమార్ధంలో రెండు జట్లు రక్షణాత్మకంగా ఆడాయి. నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఎవరూ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ కాస్త దూకుడు ప్రదర్శించింది. బంతిని ఎక్కువ సమయం అదుపులో ఉంచుకుంది. దీంతో రెండు క్వార్టర్లు ముగిసే సరికి రెండు జట్లు 0-0తో నిలిచాయి. మూడో క్వార్టర్‌లో భారత్‌ ఖాతా తెరిచింది. 39వ నిమిషంలో సత్భీర్‌సింగ్‌ అద్భుతంగా గోల్‌ చేసి జట్టును 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. ఇక నాలుగో క్వార్టర్‌లో టీమిండియా విజృంభించింది. పాక్‌ పొరపాట్లను సొమ్ము చేసుకుంటూ గోల్స్‌ వర్షం కురిపించింది. 41వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యం 2-0కు పెంచాడు. ఆ తర్వాతి నిమిషమే లలిత్‌ బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టి మూడో గోల్‌ అందించాడు. 57వ నిమిషంలో గుర్జంత్‌సింగ్‌ గోల్‌ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. దీపావళి రోజున 6-2తో చిత్తుచేసిన మలేసియాతో టీమిండియా తలపడనుంది.

Posted On 21st October 2017

Source eenadu