11 నిమిషాల్లో 103 బాణాలు... 5 ఏళ్ల చిన్నారి శివాని రికార్డ్
11 నిమిషాల్లో 103 బాణాలు... 5 ఏళ్ల చిన్నారి శివాని రికార్డ్

అయిదు సంవత్సరాల అయిదు నెలల తొమ్మిది రోజుల వయస్సులో విలువిద్యలో రెండు రికార్డులతో సత్తా చాటింది విజయవాడకు చెందిన చిన్నారి చెరుకూరి డాలీ శివాని. విజయవాడలోని వీఎంసీ ఓల్గా ఆర్చరీ మైదానంలో ఆదివారం ఈ ప్రదర్శన చేసింది. పది మీటర్ల దూరంలోని 122 సెం.మీ. టార్గెట్‌పై 103 బాణాలను 11 నిమిషాల 19 సెకన్లలో లక్ష్యం వైపు వేగంగా సంధించిన తొలి వ్యక్తిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డు నమోదు చేసింది. మరో రికార్డుగా 36 బాణాలను 20 మీటర్ల దూరంలోని 122 సెం.మీ. టార్గెట్‌పై అయిదు నిమిషాల ఎనిమిది సెకన్లలో వేగంగా సంధించి 360 పాయింట్లకు 290 పాయింట్లు సాధించింది. 18 సంవత్సరాల బాలబాలికలు తలపడే ఈ ఈవెంట్‌లో తన పేరుతో రికార్డు నమోదు చేసుకుంది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల ప్రతినిధి నీరజ రాయ్‌ చౌదరి, జాతీయ ఆర్చరీ సంఘం పరిశీలకులు బి.శ్రావణ్‌కుమార్‌, రాష్ట్ర విలువిద్య సంఘం పరిశీలకుడు డి.అనిరుధ్‌ దుర్గేష్‌, శాప్‌ పరిశీలకుడు చందు నాగార్జునల పర్యవేక్షణలో ఈ చిన్నారి ప్రదర్శన చేసింది. రికార్డులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు, పతకాలను నీరజ రాయ్‌ చౌదరి.. డాలీ శివానికి అందించి అభినందించారు. ఈ రికార్డుల వివరాలను భారత ఆర్చరీ సమాఖ్య ద్వారా ప్రపంచ ఆర్చరీ సమాఖ్యకు పంపి ధ్రువీకరణ పొందుతామని శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

Posted On 11th September 2017

Source eenadu