భారత్‌ ఘన విజయం
భారత్‌ ఘన విజయం

బ్యాట్స్‌మెన్లు విఫలమైన వేళ.. బౌలర్లు సమష్టిగా రాణించి ఆసీస్‌ను కుప్పకూల్చారు. కీలక దశలో కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ వికెట్స్‌ తీయడంతో పాటు మిగిలిన బౌలర్లూ రాణించడంతో భారత్‌ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. 43.1 ఓవర్లకే ఆలౌటయ్యారు. దీంతో 50 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ మూడేసి వికెట్లు తీయగా.. చాహల్‌, పాండ్యా చెరో రెండేసి వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో భారత్‌ నిలిచింది. కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. కోహ్లీ(92), ఓపెనర్‌ రహానె (55) రాణించారు.

10కే రెండు వికెట్లు
భారత్‌ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కార్ట్‌రైట్‌(1), డేవిడ్‌ వార్నర్‌(1)ను భువనేశ్వర్‌ కుమార్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో క్రీజులోకి వచ్చిన స్మిత్‌ (59: 76 బంతుల్లో 8 ఫోర్లు), హెడ్‌ (39: 39 బంతుల్లో) నిలకడగా ఆడి జట్టును ఆదుకున్నారు. తొలుత నెమ్మదిగా ఆడినా.. ఆ తర్వాత వేగం పెంచారు. ప్రమాదకరంగా మారుతుండడంతో కోహ్లీ స్పిన్నర్లను బరిలోకి దించాడు.

స్మిత్‌ ఒక్కడే..
స్పిన్నర్‌ చాహల్‌ రంగ ప్రవేశం చేసి వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన మాక్స్‌వెల్‌ (14) కూడా చాహల్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్‌ స్మిత్‌ మాత్రం నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో 18వ అర్ధ శతకం సాధించాడు. కొద్దిసేపటికే స్మిత్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి ఆ జట్టు స్కోరు 138/5గా ఉంది.

కుల్దీప్‌ హ్యాట్రిక్‌
స్మిత్‌ నిష్క్రమణ తర్వాత కూడా ఆసీస్‌ ఆశలు సజీవంగా ఉన్నప్పటికీ.. కుల్దీప్‌ ఆ ఆశల సామ్రాజ్యాన్ని కూల్చేశాడు. ఇన్నింగ్స్‌ 32వ ఓవర్‌లో వరుస బంతుల్లో వేడ్‌(2), అగర్‌(0), కమిన్స్‌(0)ను పెవిలియన్‌కు పంపి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. చివర్లో స్టోయినిస్‌ (62) ఒంటరి పోరాటం సాగించినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన నైల్‌(8)ను పాండ్యా.. రిచర్డ్‌సన్‌(0)ను భువనేశ్వర్‌ కుమార్‌ పెవిలియన్‌కు పంపడంతో విజయం సంపూర్ణమైంది.

కోహ్లి, రహానె శతక భాగస్వామ్యం
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (7) మరోసారి నిరాశ పరిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ (92), రహానె (55)తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ శతకాలు నమోదు చేశారు. దూకుడుగా ఆడుతున్న క్రమంలో రహానె రనౌట్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పాండే(3) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. జాదవ్‌ (24) కూడా కొద్దిసేపు కెప్టెన్‌ కోహ్లీతో కలిసి బ్యాట్‌ ఝుళిపించాడు. స్కోరు వేగం పుంజుకుంటున్న క్రమంలో నైల్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి జాదవ్‌ వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 186/4.

చివర్లో టప టపా..
ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్‌ కోహ్లీ మాత్రం నిలకడగా ఆడుతూ వచ్చాడు. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన కోహ్లీని నైల్‌ బౌల్డ్‌ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ(5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ధోనీ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేదు. భువనేశ్వర్‌ కుమార్‌ (20), హార్దిక్‌ పాండ్యా(20), కుల్దీప్‌ యాదవ్‌ (0), బుమ్రా(10), చాహల్‌(1) స్వల్ప స్కోర్లుకే వెనుదిరిగారు. భారీ స్కోరు చేసేందుకు ఆస్కారం ఉన్న చివరి ఓవర్లలో స్కోరు రాబట్టడంలో టీమిండియా బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు.

Posted On 21st September 2017

Source eenadu