నేరేడు తో ఎన్ని లాభాలో
నేరేడు తో ఎన్ని లాభాలో

  • పోషకాల గని.. ఆరోగ్య సంవర్థని నేరేడులో పోషకాలు ఎన్నో!
  • డయాబెటీస్‌ నియంత్రణ

 
గజానునికి ఇష్టమైన పదార్థాలలో వెలగపండ్లుతో పాటుగా నేరుడుపళ్ళు, ఆకులు కూడా ఉన్నవి. నేరేడు చెట్టు ఫలం వల్ల ఉపయోగాలు కోకొల్లలు. నేరుడు చెట్టు పళ్ళే కాదు, కాండపు బెరడుతో సహా ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. సంస్కృతంలో దీనిని జంభూ ఫలం అంటారు. మన దేశానికి ప్రాచీన నామం కూడా ‘‘జంభూ ద్వీపం’’ అందుకే హైందవ మంత్రాలలో జంభూ ద్వీపే....భరత వర్షే....భరత ఖండే......అని ఉంటుంది. పేరుకు తగ్గట్టే మన దేశంలో ఇవి అధికంగా పండుతాయి. సిజీజీయం క్యూమిస్‌ దీని శాస్త్రీయ నామం. ఇవి సీజనల్‌ పళ్ళు. సాధారణంగా వేసవి ఆఖరు నుంచి వర్షాకాలం మొదలైన రెండు మూడు వారాల వరకూ ఉంటాయి. ఇవి సున్నితంగా ఉండటం వల్లకింద పడితే పాడవుతాయి. అందువల్ల వీటిని జాగ్రత్తగా కోస్తారు. వీటిలో అల, చిట్టి, జంబో తదితర రకాలు ఉన్నాయి.
 
రాముని వనవాసంలో: వనవాస సమయంలో రామ లక్ష్మణ సీతలు ఈ పండ్లును తిని కడుపు నింపుకునే వారని రామాయణంలో ప్రస్తావన  ఉంది. అందుకే గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో దీనిని దేవతా వృక్షంగా పూజిస్తారు. పోర్చుగీసు వారు మన దేశానికి వలస వచ్చినప్పుడు వీటి విత్తనాలు తీసుకువెళ్ళి బ్రెజిల్‌కు పరిచయం చేశారని చెబుతారు.ఈ చెట్లు 30 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. వీటిని అక్కడ గిని చెట్లు అంటారు. వందేళ్ల వరకు జీవిస్తాయి. 
 
తూర్పుగోదావరి జిల్లాలో..
ఏజెన్సీ. గండేపల్లి, మురారి, నందరాడ, దోసకాయలపల్లి, యర్రంపాలెం వంటి పల్లెటూళ్ళ నుంచి బుట్టలు, ప్లాస్టిక్‌ ట్రేలలో వీటిని తీసుకువచ్చి రాజమహేంద్రవరంలో కంబాలచెరువు సమీపంలో ఉన్న రెండు హోల్‌సేల్‌ దుకాణాలలో విక్రయిస్తారు. ఒక్కో దానిలో 30 నుంచి 50 కేజీల వరకూ ఉంటాయి. తోపుడు బండ్లు, సైకిల్‌ వ్యాపారులు హోల్‌సేల్‌గా కొని రిటైల్‌గా కేజీ రూ.120 వరకూ విక్రయిస్తారు. ఇక్కడి  నుంచి విజయవాడ, గుంటూరు, విశాఖ, కాకినాడ, తాడేపల్లిగూడెంలతో పాటు దూర ప్రాంతాలకు, జిల్లాలో పలుప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. 
 
ఆరోగ్య సంవర్థని 
సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లలో నేరుడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని. అనారోగ్యాల నివారణి, రోజు ఒక యాపిల్‌ తినండి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉండదు అంటారు. అయితే రోజూ నాలుగు నేరేడు పళ్ళు తిన్నా అంతకన్నా వంద రేట్లు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కేంద్ర నాడీ మండలం అతి చురుకుదనాన్ని తగ్గించే గుణం నేరేడు గింజలకు ఉన్నట్టు లక్నోకు చెందిన సెంట్రల్‌ డ్రగ్‌ ఇనిస్టిట్యూట్‌ చెబుతుంది. వర్షాకాలంలో సాధారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించే గుణం ఆకులకు, పండ్లకు ఉంది, కాల్షియం, ఐరన్‌, పోటాషియం, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఈ పళ్ళు తింటే వ్యాధి నిరోధకశక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది. నేరేడు ఆకులతో చేసే కషాయం బాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం. గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంది. డేయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. కేన్సర్‌ రాకుండా చేయడంలో నేరుడు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ళ వాసులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్ళతో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంతో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే ఉపశమనం లభిస్తుంది.నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడే వారికి 30 ఎంఎల్‌ నీళ్ళలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం కనిపిస్తుంది.జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరుడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితో పాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. నులిపురుగులు నశిస్తాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పని చేస్తాయి. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్ళలో కలిపి తీసుకోవాలి.
 
శరీరంలో వేడిని తగ్గించి....తక్షణ శక్తిని ఇస్తాయి: ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విజమిన్లు, క్రోమియం...వంటివి నేరేడులో పుష్కలం. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. తక్షణ శక్తిని ఇస్తాయి.
 
డయాబెటీస్‌ను నియంత్రిస్తుంది :  గుజరాతీ భాషలో ‘‘లంబూ జీవతి ఛే...తో జంబూ ఖావు ఛే...’’ అనే సామేత ఉన్నది. అంటే నేరేడును తింటే చక్కెర వ్యాధి పరార్‌ అని అర్థం. మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గ్లైకమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ వ్యాధికి చక్కగా ఉపయోగపడతాయి. గింజల్ని ఎండెబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే చక్కెర తగ్గుతుంది.

నెలసరి సమస్యలకు :చాలా మంది స్త్రీలు నెలసరిలో విపరీతమైన నొప్పి వంటి వాటితో బాధ పడతారు. అలాంటి వారు నేరుడు చెక్క కషాయాన్ని 25 రోజుల పాటు 30 ఎంఎల్‌ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది
 
అల్ల నేరేడు చెట్టు కాడా.. 
నేరేడు పండ్లను కవుల కలాలు వదల్లేదు. తెలుగు సినిమాల్లో నేరేడు చెట్టుపై పలు పాటల పల్లవులతో ప్రయోగాలున్నాయి. ఆడపిల్లల కళ్ళను.. నేరేడుతో పోల్చడం విశేషం.
 
నేరేడు పండ్ల జ్యూస్‌  ఇలా చేయవచ్చు.. (కావలసినవి ): నేరుడు పండ్ల రసం ఒక కప్పు, రాగి పిండి అరకప్పు, ఖర్జూర పళ్లు 6, రోజ్‌ వాటర్‌ ఒక కప్పు, ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్‌ ఒకటి..
తయారు చేసే విధానం : ముందుగా నేరేడు పళ్ళను కడిగి నీటిలో వేసి.. గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తీసుకోవాలి. రాగిపిండిని ఒక కప్పు నీటిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో నాలుగు కప్పుల నీరు పోసి స్టౌపై మరుగుతుండగా రాగిపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా  వేసి కలపాలి. 2 నిమిషాల తర్వాత దించాలి. ఖర్జూర పండ్లముక్కలు, ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్‌ ముక్కలు, రోజ్‌ వాటర్‌ కలిపి మిక్సీలో వేసి తిప్పి అందులో నేరేడు పండ్ల రసం, రాగి మిశ్రమం వేసి మరోసారి తిప్పితే పోషకాలు గల జంభూ జ్యూస్‌ రెడీ..
 
పోషకాలు (వంద గ్రాముల్లో)..
తేమ 83.7 గ్రా., పిండి పదార్థం 19 గ్రా, మాంసకృత్తులు 1.3 గ్రా, కొవ్వు 0.1, ఖనిజాలు  0.4 గ్రా, పీచుపదార్థం 0.9 గ్రా, కాల్షియం 15.30 మి.గ్రా, ఇనుము 0.4 గ్రా- 1 మి.గ్రా, సల్ఫర్‌, 13 మి. గ్రా, విటమిన్‌ సి 18 మి.గ్రా, ఫోలిక్‌ యాసిడ్‌ 3 మి.గ్రా, మెగ్నీషియం 35.మి.గ్రా, ఫాస్పరస్‌ 15 మి.గ్రా, సోడియం 28 మీ.గ్రా, శక్తి 82 కేలరీలు ఉంటాయి. నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్ఫియం, ఫాస్పరస్‌, మాంగనీసు, జింక్‌, ఐరన్‌, విటమిన్‌ సీ,ఏలు, రైబోప్లెవిన్‌, నికోటిన్‌ ఆమ్లం, కొలైన్‌, ఫోలిక్‌ యాసిడ్లు  లభిస్తాయి. దానిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది.
 
డయాబెటీస్‌ నియంత్రణ జాగ్రత్తలు 
నేరుడు వగరుగా ఉండి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల కొద్దిగా ఉప్పు వేసి తీసుకుంటే రుచితో పాటు వగరు, అరుగుదల సమస్య ఉండదు. భోజనంగంట తర్వాత తీసుకుంటే సులువుగా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య ఉండదు.

Posted On 24th September 2017

Source andhrajyothi