T20 సిరీస్ మనదే... ఉత్కంఠ పోరులో విజయం
T20 సిరీస్ మనదే... ఉత్కంఠ పోరులో విజయం

వరుణుడి దెబ్బకు 20 ఓవర్ల మ్యాచ్‌ కాస్తా 8 ఓవర్ల పోరుగా మారిపోయింది. కీలకమైన టాస్‌ ప్రత్యర్థినే వరించింది. ఎనభయ్యో తొంభయ్యో కొట్టి కివీస్‌కు సవాలు విసురుతుందనుకుంటే.. ఎనిమిది ఓవర్ల ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లు కోల్పోయి 67 పరుగులే చేయగలిగింది భారత్‌. ఈ పర్యటన ఆసాంతం చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన చేసిన కివీస్‌కు ఈ లక్ష్యం ఓ లెక్కా అనుకున్నారు చాలామంది! కానీ భారత్‌ ఆశలు వదులుకోలేదు. పట్టు వదల్లేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌, పకడ్బందీ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేసింది. చివర్లో కొంచెం ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. విజయం భారత్‌దే. వన్డే సిరీస్‌లో మాదిరే టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతోనే నెగ్గింది భారత్‌. రెండు సిరీస్‌లూ భారతే నెగ్గినా.. గత రెండేళ్లలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో కోహ్లీసేనకు కివీస్‌లా పోటీ ఇచ్చిన జట్టు మరొకటి లేదు, ఇంత మజా ఇచ్చిన సిరీసూ ఇంకోటిలేదు.

న్యూజిలాండ్‌ను వన్డేల్లోనే కాక, టీ20ల్లోనూ ఓడించింది భారత్‌. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో నెగ్గింది. తిరువనంతపురంలో వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో (నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలైంది) భారత్‌ మొదట 5 వికెట్ల నష్టానికి 67 పరుగులే చేసింది. అనంతరం కివీస్‌ 61/7కు పరిమితమైంది. కివీస్‌ను కట్టడి చేసిన బుమ్రా (2/9) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు సైతం అతడికే దక్కింది.

టపటపా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. ఓపెనర్లు ధావన్‌ (6), రోహిత్‌ (8) ఎంతో సేపు క్రీజులో నిలవలేదు. వీళ్లిద్దరినీ సౌథీ (2/13) ఔట్‌ చేశాడు. మూడు ఓవర్లకు భారత్‌ స్కోరు 18/2. ఐతే తర్వాతి ఓవర్లో కోహ్లి వరుసగా 6, 4 బాది స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ అతను అదే ఓవర్‌ ఐదో బంతికి మరో భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. ఆ తర్వాత మనీష్‌ పాండే (11 బంతుల్లో 17; 1×4, 1×6) రెండు భారీ షాట్లు ఆడి భారత్‌ స్కోరును 50 దాటించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (6 బంతుల్లో) వేగంగా ఆడలేకపోయాడు. పాండ్య ఓ భారీ సిక్సర్‌ కొట్టాడు. బౌల్ట్‌ (2 ఓవర్లలో 1/13) చివరి ఓవర్లో పాండేను ఔట్‌ చేయడంతో పాటు 6 పరుగులే ఇచ్చాడు.

బుమ్రా, చాహల్‌ సూపర్‌: లక్ష్యం భారీగా ఏమీ లేకపోయినా భారత్‌ గెలిచిందంటే అందుకు బుమ్రా (2 ఓవర్లలో 2/9), చాహల్‌ (2 ఓవర్లలో 0/8) కట్టుదిట్టమైన బౌలింగే కారణం. మన్రో ఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్సర్‌ బాది భయపెట్టినా, ఆ ఓవర్లో మిగతా బంతులు పకడ్బందీగా వేసిన భువనేశ్వర్‌.. చివరి బంతికి గప్తిల్‌ (1)ని బౌల్డ్‌ చేశాడు. రెండో ఓవర్లో బుమ్రా మూడే పరుగులిచ్చి ప్రమాదకర మన్రో (7)ను ఔట్‌ చేశాడు. చాహల్‌ మూడో ఓవర్లో ఐదు పరుగులే ఇవ్వడంతో సమీకరణం (5 ఓవర్లలో 52) కివీస్‌కు కష్టంగా మారింది. కుల్‌దీప్‌ వేసిన ఐదో ఓవర్లో విలియమ్సన్‌ (8) రనౌట్‌ కాగా.. ఫిలిప్స్‌ (11) ధావన్‌ చేతికి చిక్కాడు. ఐతే గ్రాండ్‌హోమ్‌ (17 నాటౌట్‌; 10 బంతుల్లో 2×6) కొంచెం ధాటిగా ఆడుతూ కివీస్‌లో ఆశలు రేపాడు. చివరి ఓవర్లో (పాండ్య) 19 పరుగులు అవసరమవగా.. మూడో బంతికి గ్రాండ్‌హోమ్‌ సిక్సర్‌ బాదాడు. తర్వాతి బంతికి వైడ్‌ పడింది. 3 బంతుల్లో 10 పరుగులే అవసరమవడంతో ఉత్కంఠ నెలకొంది. ఐతే చివరి మూడు బంతులకు వరుసగా 1, 2, 1 పరుగులే రావడంతో మ్యాచ్‌ భారత్‌ సొంతమైంది.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) శాంట్నర్‌ (బి) సౌథీ 8; ధావన్‌ (సి) శాంట్నర్‌ (బి) సౌథీ 6; కోహ్లి (సి) బౌల్ట్‌ (బి) సోధి 13; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) గప్తిల్‌ (బి) సోధి 6; మనీష్‌ పాండే (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) బౌల్ట్‌ 17; పాండ్య నాటౌట్‌ 14; ధోని నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (8 ఓవర్లలో 5 వికెట్లకు) 67

వికెట్ల పతనం: 1-15, 2-15, 3-30, 4-48, 5-62

బౌలింగ్‌: బౌల్ట్‌ 2-0-13-1; శాంట్నర్‌ 2-0-16-0; సౌథీ 2-0-13-2; సోధి 2-0-23-2

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (బి) భువనేశ్వర్‌ 1; మన్రో (సి) రోహిత్‌ (బి) బుమ్రా 7; విలియమ్సన్‌ రనౌట్‌ 8; ఫిలిప్స్‌ (సి) ధావన్‌ (బి) కుల్‌దీప్‌ 11; గ్రాండ్‌హోమ్‌ నాటౌట్‌ 17; నికోల్స్‌ (సి) అయ్యర్‌ (బి) బుమ్రా 2; బ్రూస్‌ రనౌట్‌ 4; శాంట్నర్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (8 ఓవర్లలో 6 వికెట్లకు) 61

వికెట్ల పతనం: 1-8, 2-8, 3-28, 4-28, 5-39, 6-48

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-18-1; బుమ్రా 2-0-9-2; చాహల్‌ 2-0-8-0; కుల్‌దీప్‌ 1-0-10-1; పాండ్య 1-0-11-0 
 

ఇటు శాంట్నర్‌.. అటు రోహిత్‌

భారత్‌-కివీస్‌ మూడో టీ20లో రెండు అద్భుత క్యాచ్‌లు అందరినీ అబ్బురపరిచాయి. ముందుగా భారత్‌ ఇన్నింగ్స్‌లో పాండే ఔటైన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌. లాంగాన్‌లో పరుగెత్తుకుంటూ వచ్చిన శాంట్నర్‌.. బంతిని అందుకునే క్రమంలో పడబోయాడు. ఐతే అంతలోనే తనకు సమీపంలో ఉన్న గ్రాండ్‌హోమ్‌ను చూసి, బంతిని అతడి వైపుగా నెట్టాడు. అతను క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో మన్రో క్యాచ్‌ను రోహిత్‌ వెనక్కి పరుగెడుతూ డైవ్‌ చేసి అద్భుత రీతిలో అందుకున్నాడు.

6 నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్‌ గెలిచిన పరుగుల తేడా. వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ 6 పరుగుల తేడాతోనే నెగ్గింది. రెండు సిరీస్‌లూ భారత్‌ 2-1తోనే నెగ్గింది.

* రెండు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లున్న గత 8 టీ20 సిరీస్‌లనూ కివీస్‌ కోల్పోలేదు. ఇప్పుడు భారత్‌ చేతిలో సిరీస్‌ ఓడింది.

Posted On 8th November 2017

Source eenadu