దేశంలో విజయవాడ నెం 1
దేశంలో విజయవాడ నెం 1

స్వచ్ఛ భారత్‌లో ఇండియాస్‌ క్లీనెస్ట్‌ బిగ్‌ సిటీగా విజయవాడ రికార్డు సృష్టించింది. అదేవిధంగా తిరుపతి నగరం కూడా స్వచ్ఛ భారత్‌లో ఇండియాస్‌ బెస్ట్‌ సిటీ ఇన్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌గా రికార్డు నెలకొల్పింది. పరిశుభద్రతపై దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 4041 నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. జాతీయ స్థాయిలో 23 నగరాలకు అవార్డులు ప్రకటించగా వీటిలో విజయవాడ, తిరుపతి ఉండడం గమనార్హం.

విజయవాడ నగరం సాధించిన ర్యాంకులు

2018లో- 1వ ర్యాంకు ( 4041 నగరాలు పోటీ పడ్డాయి )

2017లో- 19వ రాంకు ( 437 నగరాలు పోటీ పడ్డాయి )

2016లో- 23వ ర్యాంకు ( 75bనగరాలు పోటీ పడ్డాయి )

ర్యాంకు కోసం కేటాయించిన మార్కులు - 4000

* పారిశుద్ధ్యంపై నగరపాలక సంస్థ చేపట్టిన పనులు, అందించిన వివరాలకు లభించిన మార్కులు-1400 మార్కులు(35శాతం)

* సర్వే బృందం నిర్వహించే ప్రత్యక్ష పరిశీన ఆధారంగా వచ్చిన మార్కులు- 1200 (30 శాతం)

* నగర ప్రజల నుంచి స్వచ్ఛతపై అందిన అభిప్రాయాల ఆధారంగా లభించిన మార్కులు- 1400 మార్కులు(35 శాతం)

నగర కమిషనర్‌ జె.నివాస్‌ ప్రత్యేక శ్రద్ధ:

నగరంలోని చెత్తసేకరించే అన్ని ప్రాంతాలను పర్యవేక్షించేందుకు వినూత్నంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు రహదారుల పక్కన చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తరలించడం, తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించడం, ప్రజా మరుగుదొడ్లను ఆధునికీకరించడం, నగరంలోని పాఠశాలల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛకార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం, కాలువల పక్కన సుందరీకరణ, ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా వాలంటీర్లను ఏర్పాటు చేయడం, ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయడం వంటివి చర్యలు చేపట్టారు. మరోవైపు నగరంలోని కూడళ్లన్నింటినీ అందంగా మారుస్తూ ఫౌంటేన్లు, గ్రీనరీని పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. రహదారులకు ఇరువైపులా ఉన్న గోడలన్నింటినీ అందమైన చిత్రాలతో అలంకరించారు. వాణిజ్య సముదాయాల వద్ద తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేకంగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు. నిత్యం సేకరించే తడి చెత్తనున ఎరువుగా మార్చేందుకు నగరంలోని రైతుబజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద 11 ప్రాంతాల్లో కంపోస్టుయార్డులను ఏర్పాటు చేశారు. ఆటోనగర్‌, విద్యాధరపురం ప్రాంతాల్లో రెండు పెద్ద కంపోస్టు యార్డులను నెలకొల్పారు. నగరంలో 550 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తుండగా.. దీనిలో 200 మెట్రిక్‌ టన్నుల తడి చెత్త ఉంటోంది. ఈ చెత్త మొత్తం ప్రస్తుతం కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు. నగరంలో రూ.40 కోట్లతో శుభ్రత, డ్రైనేజీ, మురుగు తొలగింపు వంటి పనులకు యంత్ర పరికరాలను కొనుగోలు చేశారు. విజయవాడలోని సొరంగం కూడా రంగులతో అందంగా మార్చారు. అలాగే ఏళ్ల తరబడి అజిత్‌సింగ్‌నగర్‌లో పేరుకు పోయిన చెత్తను తరలించేందుకు ప్రారంభించిన బయోమైనింగ్‌ విధానాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలించింది.

Posted On 17th May 2018

Source eenadu