AP భవన్ లో బాబుని కలిసిన... మమత, విజయన్, కుమారస్వామి
AP భవన్ లో బాబుని కలిసిన... మమత, విజయన్, కుమారస్వామి

నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబుని కలవడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత భెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి  కుమార స్వామి AP భవన్ కి వచ్చారు. వీరి సమావేశం ఆసక్తికరంగా మారింది.

కేంద్రంపై పోరాటమే

విభజన చట్టంలోని అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని భావిస్తున్న చంద్రబాబు, కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నంలో భాగంగానే భావసారూప్యంగల పార్టీల్ని సంఘటితం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశం రాజకీయాలకు అతీతంగా జరిగేదైనప్పటికీ, దానికో రాజకీయ ప్రాధాన్యం తెస్తున్నారు. దిల్లీ వెళ్లడానికి ముందే... తమతో కలసి వచ్చే ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆయన ద్విముఖ వ్యూహంతో దిల్లీకి వెళ్లారు. విభజన హామీల అమలుపై రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పాటు, మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, దేశవ్యాప్తంగా నెలకొన్న సమస్యల్ని నీతి ఆయోగ్‌ సమావేశంలో ఎండగట్టడం మొదటి వ్యూహం. దీనికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతూ తీసుకోనున్నారు. రెండోది ఎన్‌డీయే, యూపీయే కూటమిలో లేని పార్టీల్ని సంఘటితం చేయడం. రెండో వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దిల్లీలోని ఏపీ భవన్‌ చాన్నాళ్ల తర్వాత కీలకమైన రాజకీయ పరిణామానికి వేదికైంది. యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీయే-1 ప్రభుత్వాల్లో తెదేపా క్రియాశీలక పాత్ర పోషించినప్పుడు ఏపీ భవన్‌ అనేక రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచేది. నిత్యం అగ్రనేతల సమావేశాలతో కళకళ్లాడేది. మళ్లీ ఇన్నాళ్లకు నలుగురు ముఖ్యమంత్రుల కీలక సమావేశానికి ఏపీ భవన్‌ వేదికైంది.

Posted On 17th June 2018