కేజ్రివాల్ కు మద్దతుగా... ముఖ్యమంత్రులు
కేజ్రివాల్ కు మద్దతుగా... ముఖ్యమంత్రులు

కేజ్రీవాల్‌ చేస్తున్న ధర్నాకు నలుగురు ముఖ్యమంత్రులు మద్దతు పలికారు. ముఖ్యమంత్రులందరూ ఐక్యంగా ఉండాలనీ, అప్పుడే కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష పోకడకు స్వస్తి పలకవచ్చని వీరు పేర్కొన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌ ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఆదివారం జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశం నిమిత్తం శనివారం దిల్లీకి వచ్చిన ఈ నలుగురు సుమారు గంటసేపు సమావేశమయ్యారు. వీరంతా ఏపీ భవన్‌కు చేరుకుని చర్చలు జరిపారు, సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. దిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి కోసం ధర్నా చేస్తున్న కేజ్రీవాల్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించారు. ప్రధాని నివాసం ముట్టడి సమయంలో ఇటీవల అరెస్టయిన తెదేపా ఎంపీలకు కేజ్రీవాల్‌ సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు చొరవ తీసుకొని ఐక్యంగా ఉండాల్సిన అవసరం గురించి సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌లకు తెలిపారు.

కేజ్రీవాల్‌కు మద్దతు తెలపడం వల్ల రాష్ట్రాల ఐకమత్యాన్ని కేంద్రానికి తెలియపరచవచ్చని సూచించారు. సమష్టిగా పోరాడితేనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర అవసరాలకు తగిన నిధులు సాధించుకోవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపైనా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనా ముగ్గురు ముఖ్యమంత్రులతో చంద్రబాబు చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. ఆంధ్ర  ప్రజల  ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని వారికి వివరించినట్లు తెలిసింది. కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపే క్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బైజల్‌ను కలసి వినతిపత్రం ఇవ్వడానికి అనుమతి కోరుతూ లేఖను ఎల్జీ నివాసానికి పంపారు.

ఆ తర్వాత నలుగురు ముఖ్యమంత్రులు కలిసి నేరుగా దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్నారు. అక్కడికి దగ్గరలోఉన్న ఎల్జీ నివాసానికి వెళ్లడానికి అనుమతి కోసం వేచి చూశారు. అనుమతి రాకపోవడంతో కేజ్రీవాల్‌ సతీమణి సునీత, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం నలుగురు సీఎంలు మీడియాతో మాట్లాడారు. దిల్లీ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కోసం కేజ్రీవాల్‌ చేస్తున్న ధర్నా గురించి ఆదివారం నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో సమయం చూసుకొని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లాలని నలుగురు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా విపక్ష ఐక్య కూటమిని ఏర్పాటుచేయాలని భాజపాయేతర పార్టీలు ప్రయత్నిస్తున్న తరుణంలో వీరి భేటీ జరగడం విశేషం

Posted On 17th June 2018

Source eenadu