మోడీ ఎదుట... కేంద్రాన్ని నిలదీసిన బాబు
మోడీ ఎదుట... కేంద్రాన్ని నిలదీసిన బాబు

ప్రధాని మోదీ ఎదుట ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు.  ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగుతోన్న నీతిఆయోగ్ సమావేశంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అక్షరక్రమం ప్రకారం చంద్రబాబుకు ముందుగా మాట్లాడే అవకాశం లభించింది.

సమావేశం ప్రారంభమయ్యాక చంద్రబాబు 13 పేజీల ప్రసంగాన్ని 20 నిముషాలపాటు ప్రస్తావించారు. నీతిఅయోగ్ అంశాలపై ప్రస్తావనకు ముందే ఏపీ విభజన హామీల అమలులో కేంద్రం తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజనను కోరుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయాల్సిన నిధుల గురించి ఆయన మాట్లాడారు. విభజనతో ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, కానీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. విభజనతో ఆర్థికంగా ఏపీ నష్టపోయిందని, రెవెన్యూలోటును భర్తీ చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తదితర వాటిపై ఆయన ప్రసంగించారు. ఈ అంశాలను బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని, తర్వాత ఫైనాన్స్ కమిషన్ సాకుగా చూపించి హోదా ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్రానికి హోదా ఎందుకు అవసరమన్నది కూడా చంద్రబాబు వివరించారు. వెనుకబడిన 7 జిల్లాలకు ఇస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని, ఎక్కువ చేయాలని కోరారు. రెవెన్యూ లోటును భర్తీ చేయాలన్నారు. విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన నిధులు త్వరగా విడుదల చేస్తే వాటి నిర్మాణాలు పూర్తి అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, సీట్ల పెంపు విషయాన్ని కూడా ఈ సందర్బంగా చంద్రబాబు ప్రస్తావించారు. స్టీల్ ఫాంట్, వైజాగ్-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, విశాఖ, విజయవాడ మెట్రోరైల్, పోర్టు వీటన్నిటితోపాటు 1971ని ఆధారంగా చేసుకుని నిధులు ఇవ్వాలన్నారు.

చంద్రబాబు ప్రసంగానికి అడ్డుపడిన రాజ్‌నాథ్‌

నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. అయితే 7 నిమిషాల ప్రసంగం అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇచ్చిన సమయం ముగిసిపోయిందంటూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే ఏపీ సమస్యలు ప్రత్యేకమైనవి అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Posted On 17th June 2018