నిర్ణయాల స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలేయండి
నిర్ణయాల స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలేయండి

‘‘రాష్ర్టాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ర్టాలను కేంద్రం ప్రోత్సహించాలి. ముఖ్యంగా పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల వంటివి అందించాలి. లేకపోతే, అదనంగా కేంద్రం నిధులు మళ్లించాలి. అలాగే, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పాడి, కోళ్ల, మత్స్య పరిశ్రమలు, మేకలు, గొర్రెల పెంపకాలను ఆదాయ పన్ను నుంచి మినహాయించాలి. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి సూచించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను ఒకే సమగ్ర రంగంగా పరిగణించాలని కోరారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలను సడలించి కేంద్ర ప్రాయోజిత పథకాలపై రాష్ట్రాలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే గ్రామీణ ఉపాధి పథకం నిధులను వ్యవసాయానికి మళ్లించాలని కోరారు. వ్యవసాయ ఉత్పాదక వ్యయం తగ్గేందుకు ఇది వీలు కల్పిస్తుంది. వ్యవసాయ పనుల్లో 50 శాతం ఉపాధి నిధుల నుంచే కేటాయించాలి. రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సమావేశంలో వివరించారు.

సంక్షేమం మాకే!

‘‘విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థికం, అంతర్జాతీయ అంశాలపైనే కేంద్రం ప్రధానంగా దృష్టిసారించాలి. ఈ రంగాల్లోనే దేశం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఇతర రంగాల్లో రాష్ట్రాలకు ఎక్కువ అవకాశం కల్పించాలి. ఆరోగ్యం, విద్య, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల అభివృద్ధికి కేంద్రం కొంత వెసులుబాటు కల్పించాలి. ఎక్కువ చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాలకే అవకాశం కల్పించాలి. ఆయా రంగాలకు విడుదల చేసే నిధుల్లో సులభతర విధానం అమలు చేయాలి’’ అని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

చరిత్రలో నిలవనున్న పథకాలు, ప్రాజెక్టులు

తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి తోడ్పాటు, పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు తదితర పథకాలను ప్రత్యేకించి ప్రస్తావించారు. ‘‘గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులను భారీ వ్యయంతో చేపట్టాం. వీటి ద్వారా 26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరిస్తున్నాం. మొత్తం 24 జిల్లాల్లో ఈ ప్రాజెక్టుల ఆయకట్టు విస్తరించి ఉంది. తెలంగాణలో 98 శాతానికిపైగా చిన్న, సన్నకారు రైతులున్నారు. వారందరికీ రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. దీనివల్ల ఆర్థిక మార్కెట్లకు నష్టం కలుగుతుందనే వాదన సరైంది కాదు. ఈ పథకంతో వ్యవసాయ ఉత్పత్తి ధరలు, పంటలను ఎంచుకునే తీరు, రుణ వ్యవస్థ ప్రభావితం కావు. ఇందులో గివిట్‌పనూ భాగం చేశాం. ఈ పథకంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి రైతులకు ఉపశమనం కలిగించాం. అలాగే ప్రతి రైతుకు రూ.5 లక్షల విలువైన బీమా చేస్తున్నాం. ఈ మేరకు ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రీమియం కింద రూ.1000 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. ఆగస్టు 15న దీనిని లాంఛనంగా ప్రారంభిస్తాం. దాదాపు 50 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. 18 నుంచి 60 ఏళ్లలోపున్న రైతులంతా పథకంలో లబ్ధిదారులే. ఇక, పంటలు బాగా పండే ప్రాంతాల్లో గోదాముల నిర్మాణాన్ని చేపట్టాం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున చర్యలు తీసుకున్నాం’’ అని కేసీఆర్‌ వివరించారు.

పట్టణ ఆస్తుల్లోనూ సంస్కరణలు

‘‘వ్యవసాయ భూమికి పట్టాదారును స్పష్టంగా నిర్ణయించే మరో ముఖ్యమైన వ్యవసాయ సంస్కరణను చేపట్టాం. 50 లక్షల భూకమతాలకు సంబంధించి పట్టాలపై అస్పష్టతను తొలగించాం. రైతులకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందజేశాం. వీటిలో 17 రకాల భద్రతా అంశాలున్నాయి. రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ రెండూ ఏకకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. పట్టణ ఆస్తుల విషయంలోనూ ఇలాంటి సంస్కరణలు చేపట్టబోతున్నాం. పట్టాదారు పాస్‌ పుస్తకాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా భూ మార్పిడులు జరుగుతున్నాయి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Posted On 18th June 2018

Source andhrajyothi