మహిళను గుండెలపై తన్నిన TRS ఎంపిపి
మహిళను గుండెలపై తన్నిన TRS ఎంపిపి

భూవివాదంలో ఓ మహిళ పై కోపోద్రిక్తుడైన ప్రజాప్రతినిధి మహిళను కాలితో గుండెలపై తన్నిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయిలో ఆదివారం చోటుచేసుకుంది. ధర్పల్లి మండల ఎంపీపీ ఇమ్మడి గోపికి ఇందల్‌వాయి మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి పక్కన సర్వే నం.1107లో నాలుగెకరాల స్థలం ఉంది. గతేడాది ఈ స్థలంలోని అతిథిగృహంతో పాటు 1125 గజాలను రూ.33.72 లక్షలకు తనకు విక్రయించినట్లు గౌరారం గ్రామానికి చెందిన ఒడ్డె రాజవ్వ పేర్కొంటున్నారు. అయితే ఎంపీపీ స్థలాన్ని అప్పగించకుండా అదనంగా రూ.65 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వాపోయారు. ఈక్రమంలో ఆదివారం గ్రామస్థులు, బంధువులతో కలిసి వచ్చిన రాజవ్వ అతిథిగృహం తాళాన్ని పగులగొట్టి సామగ్రిని బయటపడేశారు. సొమ్ము చెల్లించినా ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నావని రాజవ్వ ఎంపీపీపై చెప్పుతో దాడి చేశారు. ఈ చర్యలతో ఆగ్రహించిన ఆయన కాలితో మహిళను బలంగా తన్నడంతో ఆమె ఎగిరిపడ్డారు. అనంతరం ఎంపీపీని నెట్టేశారు. పరస్పరం ఇద్దరూ పోలీసుస్టేషన్‌లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.

Posted On 18th June 2018