సికింద్రాబాద్ లో పరువు హత్య
సికింద్రాబాద్ లో పరువు హత్య

శనివారం రాత్రి సికింద్రాబాద్ లో, మిర్యాలగూడ తరహాలో మరో ఘటన జరిగింది. కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో యువకుడిని కడతేర్చారు.

అల్వాల్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన నంద కిశోర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. పెద్దకమేళ ప్రాంతానికి చెందిన అశ్వినితో పరిచయం క్రమేణా ప్రేమగా మారింది. మూడేళ్ల కిందట పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, చారువాస్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కాగా అశ్విని తల్లికి, అశ్విని బంధువులకు ఈ పెళ్లి మొదటినుంచీ ఇష్టం లేదు. భర్తని వదిలేస్తే మరో పెళ్లి చేస్తామంటూ అశ్వినికి ఆమె పుట్టింటివారితో పాటు బంధువులు తరచూ చెప్పేవారు. ఈ నేపథ్యంలో వీరి కాపురంలో కలతలు మొదలవడంతో, అశ్విని తన రెండేళ్ల కుమారుడిని తీసుకుని పుట్టింటికెళ్లింది. ఈ సంఘటనతో, అల్లుడిపై ఉన్న కోపం మరింత పెరిగింది.

కాగా పథకం ప్రకారం అశ్విని బంధువులు  నందకిశోర్‌ను పెద్దకమ్ముల దగ్గరున్ననిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఆర్మీ స్థలాల్లోకి రమ్మని పిలిచారు. అక్కడ వారు నందకిశోర్‌తో కలిసి మద్యం సేవించారు. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీశావంటూ వారు గొడవకు దిగారు. బండరాళ్లతో తలపై మోది కర్రలతో కొట్టి చంపేశారు. నంద కిశోర్‌ను బావమరిది మైకెల్ అలియాస్ మహేశ్వర్‌, అతడి బంధువులే హత్య చేశారని హతుడి తల్లి ఆరోపిస్తున్నారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  గాంధీ మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Posted On 30th December 2018