పోలవరం ప్రాజెక్ట్‌ కు 2 గిన్నిస్‌ రికార్డులు

పోలవరం ప్రాజెక్ట్‌ కాంక్రీట్‌ పనుల్లో గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది. ఒకటి కాదు, ఏకంగా రెండు రికార్డులు నమోదు చేసింది. 24 గంటల్లో 32,100 ఘనపు మీటర్ల కాంక్రీటు స్పిల్‌ఛానల్‌లో వేయడంతో ఒక రికార్డు, ఏకధాటిగా 32,315 ఘనపు మీటర్ల కాంక్రీటు వేసిన రెండు గిన్నిస్‌ రికార్డులు నమోదయ్యాయి.

సోమవారం ఉదయం 8 గంటలకల్లా 32,100 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా కార్మికులు విరామం లేకుండా పనిచేసారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్‌ చేశారు. అర్ధరాత్రి కూడా ఫ్లడ్‌లైట్‌ వెలుగుల్లో పనులు చేశారు. ఆదివారం  దాదాపు 4 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకోగా, ఉదయం 8 గంటలకు ఈ పనులు ప్రారంభించారు.

అయితే 2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా అధిగమిచింది. 16 గంటల్లోనే ఈ రికార్డును అందుకోవడం విశేషం. రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. పోలవరం ప్రాజెక్ట్‌ ఈ రికార్డును సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఆయన సోమవారం మధ్యాహ్నం సందర్శించి గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను అందుకోనున్నారు.

Posted On 8th January 2019