మోదీకి వ్యతిరేకంగా, కదం తొక్కిన 22 పార్టీలు

విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. 22 పార్టీలకు చెందిన అగ్రనేతలు కోల్‌కతా చరిత్రాత్మక బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా మోదీ సర్కారు తీరుపై గళమెత్తారు. ఇక మోదీ సర్కారుకు మూడిందని, రాబోయే ఎన్నికల్లో భాజపాకు ఓటమేనని తేల్చిచెప్పారు. తమ మధ్య విభేదాలేమైనా ఉన్నా వాటిని విడిచిపెట్టి, ఏకతాటిపైకి వచ్చి మోదీని ఇంటిదారి పట్టిస్తామని ఆయా పార్టీల నేతలు చెప్పారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం కోల్‌కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో జరిగిన ప్రతిపక్షాల ‘ఐక్యతా భారత్‌’ ర్యాలీలో వారు పాల్గొని శంఖారావం చేశారు. ఎన్నికలకు ముందు అమరావతి సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే తరహా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారంటే...
మమతా బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), చంద్రబాబు (తెలుగుదేశం), మల్లికార్జున్‌ ఖర్గే, సింఘ్వి (కాంగ్రెస్‌), హెచ్‌డీ దేవెగౌడ (జేడీ (ఎస్‌), అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఆప్‌), శరద్‌ పవార్‌ (ఎన్‌సీపీ), శరద్‌ యాదవ్‌ (లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీ), అఖిలేశ్‌ యాదవ్‌  (సమాజ్‌వాదీ), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), ఎం.కె.స్టాలిన్‌ (డీఎంకే), సతీష్‌ చంద్ర మిశ్ర (బీఎస్పీ), హేమంత్‌ సొరేన్‌ (జేఎంఎం), శతృఘ్న సిన్హా (భాజపా అసంతృప్త ఎంపీ), అజిత్‌ సింగ్‌ (రాష్ట్రీయ లోక్‌దళ్‌), అరుణ్‌శౌరి (కేంద్ర మాజీ మంత్రి), యశ్వంత్‌ సిన్హా (కేంద్ర మాజీ మంత్రి), గెగాంగ్‌ అపాంగ్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం)

చంద్రబాబు మాట్లాడుతూ:

"మోదీ ప్రచార ప్రధానమంత్రే తప్ప పనిచేసే ప్రధానికాదు. మనకు పనిచేసే ప్రధాని కావాలి. కులాలు, మతాలు, రాష్ట్రాల మధ్య ఆయన చిచ్చుపెడుతున్నారు. రైతులను నిలువునా మోసగించారు. పేదలు, సమాజం పట్ల సహృదయంతో ఆలోచించగల నాయకుడు కావాలి. దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రజలంతా ఒక్కటై కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎన్డీయే, భాజపాలు దేశాన్ని విభజించాలని చూస్తుంటే మేం జోడించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ‘సేవ్‌ ఇండియా- సేవ్‌ డెమోక్రసీ’ అనే ఒకే నినాదంతో మేమంతా ఇక్కడికొచ్చాం. భారతదేశ ఐక్యతే ఈ సభ ఉద్దేశం"


మమత బెనర్జీ మాట్లాడుతూ:
"భాజపా ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచి అధికారం సాధించబోయేది విపక్షమే. దీనికి తగ్గట్టుగా మేమంతా కలిసి పనిచేస్తాం. ప్రధానమంత్రి ఎవరనేది సమస్యే కాదు. దానిని ఎన్నికల తర్వాత మేం నిర్ణయించుకుంటాం. రాజకీయాల్లో కొన్ని మర్యాదలనేవి ఉంటాయి. భాజపా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ పార్టీతో లేనివారందరినీ దొంగలుగా పిలుస్తోంది. సొంత పార్టీలో సీనియర్‌ నేతలైన రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ వంటి వారినీ గౌరవించకుండా విస్మరించింది. మోదీ, ఆయన సహచరులు ఇప్పుడు ఉమ్మడి  యకత్వం గురించి మాట్లాడుతున్నా, లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే మాత్రం సీనియర్‌ నేతల్ని మళ్లీ విస్మరిస్తారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ని మించిన వాతావరణం ఇప్పుడు దేశంలో నెలకొంది"

అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ:
మోదీ-అమిత్‌ షా ద్వయం మరోసారి నెగ్గితే దేశాన్ని నాశనం చేస్తారు. ముక్కలుగా విభజిస్తారు. నియంత హిట్లర్‌ చేసిన పనినే వారు చేస్తారు. రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఎన్నికలను రద్దు చేస్తారు. ఇప్పటికే చాలావరకు భ్రష్టు పట్టించారు. వారిని కూకటివేళ్లతో పెకిలించేయాలి.


ఎం.కె.స్టాలిన్‌ మాట్లాడుతూ:
లోక్‌సభకు త్వరలో జరగబోయే ఎన్నికలు మరో స్వాతంత్య్ర సమరం వంటివి. భాజపా అనుసరిస్తున్న హిందూ అతివాద వైఖరికి వ్యతిరేకంగా పోరాడి, మోదీని ఓడించి, దేశాన్ని రక్షించుకోవాలి. మోదీ మళ్లీ నెగ్గితే దేశం 50 ఏళ్లు వెనక్కి పోతుంది.


హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ:
"అవినీతిమయమైన మోదీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మనం దొంగలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం."


అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ:
ఎస్పీ-బీఎస్పీ పొత్తు దేశ ప్రజలకు ఆనందాన్ని, భాజపాకి కలవరాన్ని కలిగించింది. విపక్షాలకు ప్రధాని అభ్యర్థి ఎవరని భాజపా మమ్మల్ని ప్రశ్నిస్తోంది. అది ప్రజలు నిర్ణయిస్తారు. నరేంద్రమోదీ ఇప్పటికే నిరుత్సాహాన్ని మిగిల్చారు. మరి భాజపాలో ఆయన కాకుండా ప్రధాని అభ్యర్థిగా మరో పేరును వారు చెప్పగలరా?


ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ:
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) చోర యంత్రాలు. వాటిని వాడుక నుంచి వైదొలగించి, బ్యాలెట్‌ పత్రాల పద్ధతిని ప్రవేశపెట్టాలి. నేను ముస్లింనే అయినా దేశాన్ని ప్రేమిస్తాను


కుమార స్వామి మాట్లాడుతూ:
దేశంలో 70 ఏళ్ల తర్వాత విపక్షాల బలమైన కలయిక ఇప్పుడు కనిపిస్తోంది. ప్రజల భావోద్వేగాలను, ప్రాంతీయ ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు, తమిళనాడులో కరుణానిధి, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, యూపీలో ఎస్పీ-బీఎస్పీ చేసిన కృషి ఎంతో గొప్పది. భాజపా చెప్పేదొకటి చేసేదొకటి

Posted On 20th January 2019