చీర కొంగు చిరిగింది... ఆర్టీసీకి ఫైన్ పడింది

చీర కొంగు జరగడం ఏంటి ఆర్టీసీకి ఫైన్ పడడం ఏంటి అనుకుంటున్నారా ? నిజమే... ఆర్టీసీ బస్ వల్ల ఒక మహిళ పట్టుచీర కొంగు చిరగగా, వినియోగదారుల ఫోరం ఆర్టీసీకి మూడు వేల రూపాయల జరిమానా విధించింది.

నల్గొండ కు చెందిన నరసింహా రావు, వాణిశ్రీ దంపతులు హైదరాబాదులో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నల్గొండ బస్టాండ్ లో సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు. బస్సు దగ్గర ఒక రేకు కొంచెం వంగి ఉండడంతో ఆ రేకు తగిలి వాణిశ్రీ పట్టు చీర కొంగు చిరిగింది. ఇంకో మహిళకు కూడా అలాగే జరగడంతో ఆ రోగం సరిచేయాలని డ్రైవర్ కు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అందుకా డ్రైవర్ అది తన పని కాదని డిపో సిబ్బంది పని అని సమాధానమిచ్చారు. అయితే ఈ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన కూడా పట్టించుకోలేదు.

చివరకు నరసింహారావు దంపతులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. చిరిగిన చీర ఫోటో ఆర్టీసీ టికెట్ బస్సులో అందుకు కారణమైన బస్సు రేకు ఫోటో సాక్ష్యాలుగా సమర్పించి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన ఆ సంస్థ ఆర్టీసీకి ఫైన్ విధించింది. రెండు వేల రూపాయలు పట్టుచీర కోసం, ఇతర ఖర్చులకు మరో వెయ్యి రూపాయలు జరిమానా విధించింది.

ఈ ఘటన ఆగస్టు 26, 2018 లో జరగగా ఈనెల 18న అంటే దాదాపు ఐదు నెలల తర్వాత వారికి న్యాయం జరగడం విశేషం.

Posted On 28th January 2019