హైదరాబాద్ లో సిబ్బంది నిర్లక్ష్యం, పసిప్రాణం బలి

హైదరాబాద్, నాంపల్లి లోని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వలన, బాధ్యతారాహిత్యం వలన పాపం ఏమీ ఎరుగని పోసి ప్రాణాలు విలవిలలాడుతున్నాయి. వారి నిర్లక్ష్యమే ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది.

శిశువులకు వ్యాక్సిన్‌ వేసిన సిబ్బంది ఆ తర్వాత జ్వరం, నొప్పి తగ్గడానికి ఇచ్చే మాత్రలకు బదులు వేరే మాత్రలు ఇవ్వడంతో కిషన్‌బాగ్‌కు చెందిన రెండు నెలల ఫయాజ్‌ అనే చిన్నారి మృతిచెందగా, మరో 31 మంది శిశువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది.

నాంపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం దాదాపు 92 మంది చిన్నారులకు వైద్య సిబ్బంది టీకాలు వేశారు. వీరంతా 2 - 3 నెలల్లోపు చిన్నారులే. టీకా అనంతరం పిల్లలకు జ్వరం, నొప్పి తగ్గడానికి పారాసెటమాల్‌ వాడతారు. అయితే ఇక్కడి సిబ్బంది పారాసెటమాల్‌ మాత్రలకు బదులు ట్రమడాల్‌ అనే మరోరకం మాత్రలు ఇచ్చి పంపారు. ఇంటికి వెళ్లిన తర్వాత పలువురు శిశువులకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సిబ్బంది ఇచ్చిన ట్రమడాల్‌ మాత్ర వేశారు. అది వేసిన కొద్దిసేపటికే పిల్లల ఆరోగ్యం విషమించింది. కంగారుపడ్డ తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తీసుకెళ్ళగా, వారు నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

బుధవారం అర్ధరాత్రి వరకు దాదాపు 15 మంది శిశువులను నిలోఫర్‌కు తీసుకువచ్చారు. గురువారం ఉదయం మరికొందరిని తీసుకురావడంతో మొత్తం నిలోఫర్‌లో చేరిన చిన్నారుల సంఖ్య 31కి చేరింది. ఆసుపత్రికి చేర్చేలోపే ఒకరు మృతి చెందారు. క్లిష్టంగా ఉన్న ముగ్గురిని ప్రత్యేకంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడే చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. మిగతావారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 

చూసుకోకుండా ఇచ్చేశారు
సాధారణంగా ప్రతి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు పారాసెటమాల్‌ మాత్రలు తో పాటు సిరప్‌ కూడా సరఫరా చేస్తారు. కానీ ఇక్కడ సిబ్బంది మాత్రం మాత్రలు మాత్రమే ఇచ్చారు. అదీకాకుండా ఈ మందుల స్ట్రిప్‌లు ఒకే రంగులో ఉండటంతో పారాసెటమాల్‌ బదులు ట్రమడాల్‌ ఇచ్చేశారు.

Posted On 8th March 2019