గుడివాడ టిడిపి టిక్కెట్... దేవినేని అవినాష్ కే
గుడివాడ టిడిపి టిక్కెట్... దేవినేని అవినాష్ కే

గుడివాడ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. టిడిపి ఆవిర్భవించిన తర్వాత 9 సార్లు ఎన్నికలు జరగగా 7 సార్లు టిడిపి గెలుపొందగా, 2 సార్లు మాత్రమే ఓటమి చెందింది. 1989 లోనూ, 2014 లో మాత్రమే ఓడిపోవడం జరిగింది. 1989 లో కేవలం 510 ఓట్లతో ఓడిపోవడం జరిగింది.

అయితే గుడివాడ నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి గతంలో లా లేదు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నుండి అభ్యర్థిగా కొడాలి నాని ఉన్నారు. ఆయన్ని ఓడించడం అంత సులువు కాదు. ఆయన ఇప్పటికి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2004, 2009 నుండి తెలుగుదేశం తరపున గెలిచిన ఆయన, తరువాత జరిగిన పరిణామాలతో వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన గుడివాడ లో ఆయన తిరుగులేని శక్తిగా మారిపోయారు. ఎంతలా అంటే గుడివాడ పర్మినెంట్ ఎమ్మెల్యేగా ఆయన అభిమానులు పిలుచుకునేంతలా. అంతేకాదు టిడిపి పైనా, చంద్రబాబు పైనా, లోకేష్ పైనా సంచలన వ్యాఖ్యలు చేస్తూ టిడిపి కి కొరకరాని కొయ్యలా తయారయ్యారు.

అయితే గుడివాడ నియోజకవర్గంలో టిడిపి ఎలాగైనా గెలిచి నాని దూకుడుకి కళ్ళెం వేసే లక్ష్యంతో టిడిపి అధిష్టానం పనిచేస్తుంది. అందుకే అభ్యర్థి ఎంపిక లో తనదైన వ్యూహంతో, రావి వెంకటేశ్వరరావుని కాదని దేవినేని అవినాష్ ను బరిలోకి దింపుతున్నారు. అవినాష్ కు అధిష్టానం టికెట్ కూడా ఖరారు చేసేశారు.

దేవినేని అవినాష్ దివంగత నాయకుడు, సీనియర్ నేత దేవినేని నెహ్రూ తనయుడు. అవినాష్ 18 సం ల వయస్సులోనే విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎపి కాంగ్రెసు పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత తండ్రి దేవినేని నెహ్రూ తో కలిసి టిడిపి తీర్థం పుచ్చుకున్న ఆయన ఈ మధ్యనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఇది టిడిపి వ్యూహమా, ప్రయోగమా తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

Posted On 9th March 2019